ముందస్తు తప్పదా? | prepoll elections in tamilnaadu? | Sakshi
Sakshi News home page

ముందస్తు తప్పదా?

May 12 2015 2:29 AM | Updated on Sep 3 2017 1:51 AM

జయలలిత నిర్దోషిగా బయటపడిన నేపథ్యంలో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీలు వ్యూహరచనల్లో మునిగిపోయాయి. అంసెబ్లీని రద్దుకు సిఫారసు చేసి జయలలిత ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జయలలిత నిర్దోషిగా బయటపడిన నేపథ్యంలో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీలు వ్యూహరచనల్లో మునిగిపోయాయి. అంసెబ్లీని రద్దుకు సిఫారసు చేసి జయలలిత ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రత్యర్థి డీఎంకే ఇన్నాళ్లూ జయలలిత అవినీతిపైనే విమర్శలు సంధిస్తూ వస్తోంది. ఇప్పుడు కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చినందున దీన్ని సొమ్ము చేసుకోవడానికి, ఈ వాతావరణాన్ని అనుకూలంగా మలచుకోవడానికి జయలలిత ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జయ పార్టీ ఏఐడీఎంకే 39 స్థానాలకుగాను 37 చోట్ల నెగ్గింది. 44 శాతం ఓట్లు సాధించింది. ప్రత్యర్థి డీఎంకేకు వ్యూహరచనకు అవకాశమివ్వకుండా... కోర్టు తీర్పుతో వచ్చిన సానుకూలతను సొమ్ము చేసుకునేందుకు జయ ఎన్నికలకు వెళతారనేది విశ్లేషకుల వాదన. తమిళనాడు అసెంబ్లీకి 2016 మే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇంకా ఏడాది సమయం ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాలన కుంటుపడింది. అధికార యంత్రాంగంలో స్తబ్ధత నెలకొంది. మంత్రులపైనా ఆరోపణలు వచ్చాయి. సీఎంగా పగ్గాలు చేపట్టి మొదలు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆమె ప్రయత్నించవచ్చని మరికొందరి అభిప్రాయం. పాలనను గాడిలోపెట్టి, కొన్ని జనాకర్షక పథకాలను ప్రకటించి... అటుపై ముందస్తు ఎన్నికలకు వెళుతుందనేది వారి అంచనా. జయ సీఎంగా బాధ్యతలు చేపడితే ఆరు నెలల్లోపు మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఉప ఎన్నికకు వెళ్లకుండా... ఈలోపే ముందస్తుకు సిద్ధమవొచ్చు. మరోవైపు ఇలాంటి తీర్పును ఊహించని డీఎంకే దిగ్భ్రాంతిలో కూరుకుపోయింది. వయోభారంతో వీల్‌చైయిర్‌కు పరిమితమైన కరుణానిధి వచ్చే ఎన్నికల్లో ప్రచారంలో చురుకుగా ఉండే అవకాశాల్లేవు. ఆయన వ్యూహరచనకే పరిమితమవ్వొచ్చు. డీఎంకేకు స్టాలిన్ ప్రధాన ప్రచారకర్తగా ఉంటారు.
 - సెంట్రల్ డెస్క్, సాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement