సార్క్ దేశాధినేతలతో పాటు విదేశీ అతిథులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా విందు ఇచ్చారు.
న్యూఢిల్లీ: సార్క్ దేశాధినేతలతో పాటు విదేశీ అతిథులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆద్యంతం నూతన ప్రధాని మోడీయే ప్రధానాకర్షణగా నిలిచారు! పాక్ ప్రధాని నవాజ్ , అఫ్ఘాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స, భూటాన్ ప్రధాని టోగ్‌బే, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూం తదితరులతో కాసేపు ఆయన ముచ్చరించారని అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం ఆయన వారందరితో అధికారికంగా భేట కానున్న విషయం తెలిసిందే.
భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా విందులో వడ్డించిన పలు రాష్ట్రాలకు చెందిన పసందైన వంటకాలువిదేశీ అతిథుల చవులూరించాయి. చల్లని మెలన్ సూప్; చికెన్, మటన్ టిక్కా, తందూరీ ఆలూ, అరబీ కబాబ్ వంటి స్టార్టర్లు; కేలా మేథీ ను షాక్, ప్రాన్స్ సుక్కా, బీర్బలీ కోఫ్తా కర్రీ, జైపురీ భిండీ, దాల్ మఖానీ, పోటోల్ దొర్మాలతో కూడిన భోజనం; అనంతరం శ్రీఖండ్, సందేశ్ వంటి మిఠాయిలు, పళ్లు, చిట్టచివరగా పసందైన పాన్ వారిని అలరించాయి. సుష్మా స్వరాజ్, గడ్కారీ, వెంకయ్య నాయుడు తదితర కేంద్ర మంత్రులు కూడా విందులో పాల్గొన్నారు.