ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ క్లిప్‌ లీక్‌!

PM Modi COVID Video Conference Floor Leaders Clip Allegedly Leaked - Sakshi

న్యూఢిల్లీ: కరోనా విజృంభిస్తున్న తరుణంలో తీసుకోవాల్సిన చర్యలపై పార్లమెంట్‌లోని ఫ్లోర్‌ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ క్లిప్‌ లీక్‌ అయ్యింది. బుధవారం నాటి ఈ కాన్ఫరెన్స్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధిగా సుదీప్‌ బంధోపాధ్యాయ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఎంసీ వర్గాలు లీక్‌ చేసినట్లుగా భావిస్తున్న ఈ వీడియోలో ఓ స్క్రీన్‌పై సుదీప్‌ బంధోపాధ్యాయ్‌.. మరో స్క్రీన్‌పై ప్రధాని మోదీ మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సందర్భంగా.. దేశంలో ప్రస్తుతం  ‘సామాజిక అత్యవసర పరిస్థితి(సోషల్‌ ఎమర్జెన్సీ)’ తరహా అసాధారణ స్థితి నెలకొని ఉందని మోదీ వ్యాఖ్యానించారు. మహమ్మారిపై పోరులో గెలిచేందుకు భౌతిక దూరం పాటించడం ఒక్కటే ప్రస్తుతం మన ముందున్న మార్గమని ఆయన పేర్కొన్నారు.(మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బ్రెజిల్‌ అధ్యక్షుడు)

అదే విధంగా ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ ఎత్తివేసే నిర్ణయంపై పునరాలోచించాల్సిందిగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జిల్లా అధికారులు తనకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఒకేసారి లాక్‌డౌన్‌ ఎత్తివేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని... దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తామని ప్రధాని వెల్లడించారు. మహమ్మారి కారణంగా దేశంలో నెలకొన్నపరిస్థితుల వల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ప్రతీ ప్రాణాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.  కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గులాం నబీ ఆజాద్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ్‌, శివసేన నుంచి సంజయ్‌ రౌత్‌, బిజు జనతాదళ్‌ నుంచి పినాకీ మిశ్రా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ నుంచి ఎస్‌సీ మిశ్రా, ఎన్సీపీ నుంచి శరద్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రామ్‌ గోపాల్‌ యాదవ్‌, శిరోమణి అకాలీదళ్‌ నుంచి సుఖ్బీర్‌ సింగ్‌ బారల్‌, జనతాదళ్‌ నుంచి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌, వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.(యూపీ, ఢిల్లీలో హాట్‌స్పాట్లు మూసివేత)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top