ఆర్టికల్‌ 370 రద్దు : సుప్రీంకోర్టులో పిటిషన్‌

Petition filed in SC challenging Presidential order on Article 370 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  జమ్మూ కాశ్మీర్‌  ప్రత్యేక హోదాను  ఉపసంహరిస్తూ, ఆర్టికల్ 370 రద్దుపై  రాష్ట్రపతి ఉత్తర్వులను సవాలు చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఎల్‌ శర్మ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం జారీచేసిన ఉత్తర్వులను ఎంఎల్‌శర్మ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని పిటిషన్‌లో ఆయన ఆరోపించారు.  రాష్ట్ర అసెంబ్లీ సమ్మతిని తీసుకోకుండా రాష్ట్రపతి ఆమోదించడం చట్టవిరుద్ధమని ఎం ఎల్ శర్మ వాదిస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ  కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆర్టికల్‌ 370రద్దుపై మాజీ  ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్య అప్రజాస్వామికమని మండిపడ్డారు. తనును గృహనిర్బంధంలో ఉంచి, లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌షా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.  తన పరిస్థితే ఇలా వుంటే.. ఇక సామాన్యుడి పరిస్థితిని ఏమిటని ప్రశ్నించారు.  తాన నమ్మిన భారత దేశం ఇది కాదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి కష్ట కాలంలో దేశ ప్రజలు కశ్మీర్‌ ప్రజలకు అండగా నిలవాలంటూ కంటతడి పెట్టారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top