కొద్దిసేపు చర్చ.. ఆపై రసాభాస | Sakshi
Sakshi News home page

కొద్దిసేపు చర్చ.. ఆపై రసాభాస

Published Fri, Mar 9 2018 2:41 AM

Parliament proceedings disrupted for the fourth day amid opposition protests - Sakshi

న్యూఢిల్లీ: గత మూడు రోజులకు భిన్నంగా పార్లమెంటు ఉభయ సభల్లో గురువారం కొద్ది సేపు ప్రశాంత వాతావరణం కనిపించింది. ఉదయం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే రాజ్యసభలో పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఏకతాటిపై నిలిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదంపై సభ్యులు తమ వాణి వినిపించారు.   

లైంగిక దాడుల పట్ల ప్రతిపక్షం ఆందోళన
రాజ్యసభ ఉదయం సమావేశం కాగానే.. మహిళల అంశాలపై దాదాపు గంటపాటు చర్చ సాగింది. మహిళలపై పెరుగుతున్న నేరాల పట్ల సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు త్వరగా ఆమోదం పొందేలా చూడాలని కోరారు. చర్చను చైర్మన్‌ వెంకయ్య  ప్రారంభిస్తూ.. ‘ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు.. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో రిజర్వేషన్లతో పాటు దేశం వేగంగా పురోగమించేందుకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముంది’ అని అన్నారు. అనంతరం వివిధ పార్టీల మహిళా ఎంపీలు ప్రసంగించారు.  

ప్రధాని సమాధానానికి కాంగ్రెస్‌ పట్టు
అనంతరం చర్చ పూర్తి కాగానే విపక్షాలు నిరసన కొనసాగించాయి. బ్యాంకింగ్‌ కుంభకోణాలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభను హోరెత్తించాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రతిపక్షాల తీరుపై వెంకయ్య∙అసహనం వ్యక్తం చేస్తూ.. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదావేశారు. అనంతరం సమావేశమయ్యాక బ్యాంకింగ్‌ కుంభకోణాలపై ప్రధాని సమాధానం కోరుతూ కాంగ్రెస్, టీఎంసీ ఎంపీలతో పాటు ఇతర అంశాలపై ప్రాంతీయ పార్టీలు ఆందోళన కొనసాగించాయి. దీంతో సభను డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ శుక్రవారానికి వాయిదా వేశారు.  

రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు
లోక్‌సభ ఉదయం సమావేశం కాగానే స్పీకర్‌ మహాజన్‌ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ..రెట్టించిన  శక్తి, ఆత్మ విశ్వాసంతో మహిళలు ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.  మహిళా సాధికారత ఎంతో అవసరమని... అయితే దాన్ని సాధించడమే అతి పెద్ద సవాలన్నారు.  స్పీకర్‌ ప్రసంగం ముగియగానే.. విపక్షాలు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన కొనసాగించాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే పార్టీ ఎంపీల ఆందోళన కొనసాగించడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. అనంతరం సభ మళ్లీ సమావేశమైనా.. అదే పరిస్థితి ఉండడంతో శుక్రవారానికి వాయిదా పడింది.   
 

Advertisement

తప్పక చదవండి

Advertisement