పఠాన్‌కోట్ దాడిపై భారత్ చేరిన పాక్ విచారణ టీం | Sakshi
Sakshi News home page

పఠాన్‌కోట్ దాడిపై భారత్ చేరిన పాక్ విచారణ టీం

Published Mon, Mar 28 2016 12:40 AM

పఠాన్‌కోట్ దాడిపై భారత్ చేరిన పాక్ విచారణ టీం - Sakshi

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి ఘటనను విచారించేందుకు పాకిస్తాన్ నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన సంయుక్త విచారణ బృందం (జిట్) ఆదివారం ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకుంది. దేశంలో ఉగ్రదాడి ఘటనలకు సంబంధించి విచారణ కోసం విదేశీ అధికారులు భారత్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. పఠాన్‌కోట్ ఘటనపై మనదేశానికి చెందిన జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) కూడా  విచారణ చేస్తోంది. భారత్‌కు చేరుకున్న పాక్ విచారణ బృందానికి ఎన్‌ఐఏ అధికారులు స్వాగతం పలికారు.

పాక్ విచారణ బృందంతో పాటు ఎన్‌ఐఏ అధికారులు కూడా మంగళవారం పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌ను సందర్శించనున్నారు. ఉగ్రవాద నిరోధక ప్రత్యేక విభాగం పంజాబ్ చీఫ్ మహమ్మద్ అజీమ్ అర్షద్ పాకిస్తాన్ విచారణ బృందానికి సారథ్యం వహిస్తున్నారు. సోమవారం ఎన్‌ఐఏ కార్యాలయంలో ఈ బృందానికి ఎన్‌ఐఏ 90 నిమిషాల ప్రజెంటేషన్ ఇవ్వనుంది. పఠాన్‌కోట్ ఘటనలో సేకరించిన ఆధారాలను వివరించనుంది. అనంతరం పఠాన్‌కోట్ ఘటనలో పాక్ ప్రమేయంపై ఉన్న సందేహాలను పాక్ విచారణ బృందం నివృత్తి చేసుకోనుంది. మంగళవారం ఎన్‌ఐఏ, జిట్ టీంలు ప్రత్యేక విమానంలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ను సందర్శించనున్నారు.

Advertisement
Advertisement