భారత గగనతలంలోకి పాక్‌ హెలికాప్టర్‌

Pakistan Helicopter Enters Indian Airspace - Sakshi

జమ్మూ: నిబంధనలు ఉల్లంఘించి భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్‌ హెలికాప్టర్‌ ఆదివారం కలకలం సృష్టించింది. నియంత్రణ రేఖ వెంబడి పూంచ్‌ జిల్లా గుల్పూర్‌ సెక్టార్‌లోకి చొచ్చుకొచ్చిన తెలుపు రంగు హెలికాప్టర్‌ను కూల్చివేయడానికి భారత సైనికులు ప్రయత్నించడంతో, వెనక్కి మళ్లిందని అధికారులు చెప్పారు. అది సైనిక హెలికాప్టర్‌ కాదని, గాల్లో చాలా ఎత్తులో చక్కర్లు కొట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో మూడు ఫార్వర్డ్‌ పోస్ట్‌ల్లోని సైనికులు చిన్న తుపాకులతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నేత రజా ఫరూక్‌ హైదర్‌ ఖాన్‌ ఆ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఆ వీడియోల్ని పాక్‌ టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. గగనతల నిబంధనల్ని పాక్‌ అతిక్రమించిందని చూపడానికే భారత్‌ కాల్పులు జరిపిందని, కానీ ఆ సమయంలో తమ గగనతలంలోనే ఉన్నామని ఫరూక్‌ కార్యాలయం వెల్లడించింది. ఐరాసలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాక్‌పై మండిపడిన తరువాతి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. నిబంధనల ప్రకారం..ఎల్‌వోసీకి కిలోమీటరు దూరంలోకి హెలికాప్టర్లు, పది కి.మీ. పరిధిలోకి విమానాలు రావొద్దు.  

మిలిటెంట్‌ కాల్పుల్లో పోలీస్‌ మృతి...
షోపియాన్‌ జిల్లా పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌పై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒక పోలీస్‌ మృతి చెందారు. ఆదివారం పోలీస్‌ స్టేషన్‌పై మిలిటెంట్లు కాల్పులకు దిగడంతో వెంటనే జవాన్లు కూడా ఎదురు దాడి చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top