జైలులో చదివి.. మాజీ సీఎం ఇంటర్ పాస్ | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం జైలులో చదివి ఇంటర్ పాస్

Published Wed, May 17 2017 9:19 AM

జైలులో చదివి.. మాజీ సీఎం ఇంటర్ పాస్

న్యూఢిల్లీ: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓమ్ ప్రకాశ్ చౌతాలా 82 ఏళ్ల వయసులో ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న చౌతాలా డిగ్రీ చదవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల చదువు కోసం ఏర్పాటు చేసిన కేంద్రంలో నేషనల్ ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ఇటీవల నిర్వహించిన పరీక్షలకు మాజీ సీఎం ఓమ్ ప్రకాశ్ హాజరయ్యారు.

తాజాగా విడుదలైన ఫలితాలలో ఆయన ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారని జైలు అధికారులు తెలిపారు. తండ్రి చౌతాలా ఫలితాలపై ఆయన కుమారుడు, హర్యానా అసెంబ్లీలో ప్రతిపక్షనేత అయిన అభయ్ సింగ్ చౌతాలా హర్షం వ్యక్తం చేశారు. 'మా నాన్న ఆఖరి పరీక్ష 23న రాశారు. ఆ సమయంలో పెరోల్ పై బయట ఉన్నా, జైలు పరిసరాల్లో ఉన్న కేంద్రానికి వెళ్లేవారు. మనవడు దుష్యంత్ సింగ్ చౌతాలా వివాహానికి హాజరు అయ్యేందుకు పెరోల్ మీద ఏప్రిల్ లో కొన్ని రోజులు మాతో గడిపారు. మే5న పెరోల్ గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లారు' అని అభయ్ సింగ్ వివరించారు.

2000 సంవత్సరంలో జరిగిన 3,206 టీచర్ల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డ కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మాజీ సీఎం సహా 53 మందికి ఈ అవినీతిలో భాగం ఉందని 2013లో ట్రయల్ కోర్టు విచారణ చేపట్టింది. చివరకు 2015లో సుప్రీంకోర్టు ఆయనకు పదేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement