వాట్సాప్ గ్రూప్ అశ్లీల వీడియో.. ఎంపీపై ఫిర్యాదు
డేరా బాబా దత్త పుత్రిక పేరిట అశ్లీల వీడియోను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన ఎంపీపై...
సాక్షి, న్యూఢిల్లీ: వాట్సాప్ గ్రూప్ లో అసభ్య వీడియోను పోస్ట్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు ఓ ఎంపీ. ఫతేగఢ్ సాహిబ్ స్థానంలో ఆప్ తరపున పోటీ చేసి ఎంపీగా పోటీ చేసిన హరిందర్ సింగ్ ఖల్సా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ మధ్య ఓ వాట్సాప్ గ్రూపులో ఆయన అశ్లీల వీడియోను పోస్ట్ చేశారు. పైగా ఆ వీడియోకు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్ అంటూ కాప్షన్ కూడా పెట్టారు. దీంతో అదే గ్రూపులో సభ్యురాలిగా ఉన్న రేణు సోనియా అనే మహిళ ఎంపీపై మండిపడగా, వెంటనే గ్రూప్ నుంచి హరిందర్ అన్ జాయిన్ అపోపోయాడు.
ఈ వ్యవహారంపై రేణు సోనియా పలువురు మానవ హక్కుల కార్యకర్తలను వెంటపెట్టుకుని మరీ వెళ్లి లూథియానా డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి ఆయన ఇలాంటి పిచ్చి పనులు చేయటం సరికాదన్న ఆమె.. పైగా ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకపోవటంపై రేణు మండిపడుతున్నారు. ఆమె ఇచ్చిన కంప్లైంట్‌ను పరిశీలించిన పోలీస్ శాఖ ఖన్నా ఎస్‌ఎస్‌పీ నవజోత్‌సింగ్ మహల్‌కు విచారణ బాధ్యతలు అప్పజెప్పింది.
అది పొరపాటున జరిగింది: హరిందర్ సింగ్
మహిళ ఆరోపిస్తున్నట్లుగా తానే వీడియో వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయలేదని.. అది పొరపాటున జరిగిందని ఎంపీ హరిందర్ సింగ్ చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం తాను ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లానని.. ఆ సమయంలో స్నేహితుడి ఇంట్లో బస చేసిన తాను ఫోన్‌ను పక్కన పడేశానని చెప్పారు. అయితే కొందరు యువకులు తన ఫోన్ లో అసభ్య వీడియో డౌన్‌లోడ్ చేసి.. గ్రూప్‌లో పోస్ట్ చేశారని, వెంటనే తన భార్య వాట్సాప్ అన్ ఇన్‌స్టాల్ చేయమని సూచించగా.. తాను ఆ పని చేశానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. కొందరు ఆప్ మహిళా కార్యకర్తలు కావాలనే తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని హరిందర్ చెబుతున్నారు.