శేఖర్‌రెడ్డి డైరీలో పన్నీర్‌సెల్వం పేరు!

O. Panneerselvam name in Sekhar reddy diary, DMK demands CBI enquiry - Sakshi

సీబీఐ విచారణకు స్టాలిన్‌ డిమాండ్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇసుక కాంట్రాక్టర్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి చెందిన డైరీలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా పలువురు మంత్రుల పేర్లు ఉన్న సంగతి శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

గతేడాది నవంబర్‌లో తమిళనాడులో శేఖర్‌రెడ్డి, అతని భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీశాఖ చేసిన దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం, స్థిర, చరాస్తుల పత్రాలు బయటపడ్డాయి. వీటితో పాటు ఓ డైరీని కూడా అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అన్నాడీఎంకే ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులతో శేఖర్‌రెడ్డికి అంతర్గత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆనాటి వివరాలను నిర్ధారిస్తున్నట్లుగా పలు అంశాలను ఒక ప్రైవేటు ఆంగ్ల టీవీ చానల్‌ శుక్రవారం ప్రసారం చేసింది.

డైరీలోని కొన్ని పేజీలు తమచేతికి వచ్చాయని చెప్పింది. వారు తెలిపిన వివరాల ప్రకారం ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు విజయభాస్కర్, ఎంసీ.సంపత్, తంగమణి, ఆర్‌పీ ఉదయకుమార్, దిండుగల్లు శ్రీనివాసన్, ఎంఆర్‌ విజయభాస్కర్, కేసీ కరుప్పన్నన్‌ల పేర్లు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు శేఖర్‌రెడ్డి డైరీ ద్వారా వెలుగుచూసిన వివరాలపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top