కరువు తాండవిస్తున్నా.. వేడుకలు ఆగలేదు! | Sakshi
Sakshi News home page

కరువు తాండవిస్తున్నా.. వేడుకలు ఆగలేదు!

Published Sun, Nov 22 2015 9:46 AM

కరువు తాండవిస్తున్నా.. వేడుకలు ఆగలేదు! - Sakshi

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్ ఆదివారం 77వ ఏట అడుగుపెట్టారు. ములాయం జన్మదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామం సైఫైలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత అట్టహాసంగా శనివారం సాయంత్రం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన 77 కిలోల కేక్‌ను కట్‌ చేశారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌ లైవ్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్ నిర్వహించారు. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అత్యంత భారీ రీతిలో జరిగిన ములాయం జన్మదిన వేడుకలపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొని రైతులు అల్లాడుతున్న సమయంలో ఇంత భారీ ఖర్చు, ఆర్భాటంతో ఆయన వేడుకలు జరుపుకోవడమేమిటని ప్రత్యర్థి పార్టీలు దుయ్యబడుతున్నాయి. కరువుతో యూపీ ప్రజలు అల్లాడుతున్నా ములాయం వేడుకలు మానుకోవడం లేదని విమర్శించాయి. ఈ ఆరోపణలపై ములాయం కోడలు, ఎంపీ డింపుల్ యాదవ్ స్పందిస్తూ.. కరువు ఉన్నంతా మాత్రాన ములాయం జన్మదిన వేడుకలు ఆపాల్సిన పనిలేదని, కరువు బాధిత రైతులకు ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపట్టిందని చెప్పారు.

Advertisement
Advertisement