
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బరోసా కల్పించారు. కొద్దిరోజుల క్రితం బరేలీలోని ఆమె నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి ఆమె కుటుంబం ఆందోళనలో ఉంది. ఈ విషయం గురించి దిశా తండ్రికి ముఖ్యమంత్రి ఫోన్ చేశారు. కాల్పులు జరిపిన వారిని తప్పుకుండా పట్టుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని మీడియాతో దిశా పటానీ తండ్రి జగదీశ్ తెలిపారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ సంభాషణ గురించి ఇలా చెప్పారు. ' మా కుటుంబానికి సీఎం ధైర్యాన్నిచ్చారు. మాకు పూర్తి భద్రత కల్పిస్తామని ఫోన్‌లో చెప్పారు. కాల్పులు జరిపిన వారు అండర్ గ్రౌండ్‌లో ఉన్నా సరే పట్టుకుని తీరుతామన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా అండగా ఉంటారని ఆయన అన్నారు. మాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.' అని ఆయన అన్నారు.

దిశా పటానీ తండ్రి రిటైర్డ్ డీఎస్పీ
దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఈ కాల్పులు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు . దిశా పటానీ సోదరి ఖుష్బూ మాజీ ఆర్మీ అధికారిణి అనే విషయం తెలిసిందే. దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీ ఒక రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP). ఆయన ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో సేవలందించారు. చివరి పోస్టింగ్ బరేలీలో జరిగింది. జగదీశ్ పటానీ నిజాయితీ గల పోలీస్ అధికారిగా గుర్తింపు ఉంది. రిటైర్మెంట్ తర్వాత కూడా సామాజిక సేవ, వ్యవసాయం వంటి రంగాల్లో చురుకుగా ఉన్నారు.