
ఉత్తర ప్రదేశ్‌లో ‘మసీదు రాజకీయం’ తీవ్ర చర్చనీయాంశమైంది. సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ కొందరి పార్టీ నేతలో ఓ మసీదులో భేటీ అయినట్లు ఉన్న ఓ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే.. ప్రార్థనా స్థలాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారని బీజేపీ విమర్శలు గుప్పించగా.. దానికి ఎస్పీ అంతే దీటుగా బదులిచ్చింది.
సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తాజాగా పార్లమెంట్ సమీపంలోని ఓ మసీదుకు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే మసీదులో రాజకీయ భేటీ జరపడం ఏంటి? అని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఆయన సతీమణి, ఎంపీ డింపుల్ యాదవ్ వస్త్రధారణపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ప్రార్థనా స్థలాన్ని ఎస్పీ పార్టీ అనధికారిక కార్యాలయంగా మార్చేశారంటూ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ మండిపడ్డారు. ఎస్పీ ఎంపీ నద్వీ ఆ మసీదుకు ఇమామ్. అలాంటి చోట రాజకీయ సమావేశాలు జరపడం ఏంటి? అని ప్రశ్నించారాయన. డింపుల్ యాదవ్ కూడా అక్కడ ఉన్నారు. అయితే ఆమె వస్త్రధారణ అభ్యంతకరంగా ఉంది. ఆమె శరీర భాగాలు(వీపు, నడుం భాగం) కనపడేలాగా ఉన్నాయి. దుపట్టాతో పూర్తి శరీరాన్ని ఆమె కప్పేసుకుని రావొచ్చు కదా.. ఎందుకు అలా చేయలేదు?. ఇది మత నియమావళిని ఉల్లంఘించడమే. ముస్లింల మనోభావాలను దెబ్బ తీయడమే అని మండిపడ్డారాయన. అంతేకాదు..
ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారాయన. ఈ ఘటనను నిరసిస్తూ శుక్రవారం(జులై 25) అదే మసీదులో తాము సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారాయన. మరోవైపు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాథక్ కూడా ఈ ఘటనపై మండిపడ్డారు. ‘‘మతాన్ని రాజకీయం చేయొద్దని రాజ్యాంగం చెబుతుంది. అలాంటిది సమాజ్‌వాదీ పార్టీ రాజ్యాంగాన్ని ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే ఉంటుంది. ఆ పార్టీకి రాజ్యాంగంపై ఎలాంటి గౌరవం లేదు’’ అని అన్నారాయన.
బీజేపీ విమర్శలను సమాజ్‌వాదీ తిప్పి కొట్టింది. జాతీయ అంశాలను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఇటు అఖిలేష్, అటు డింపుల్ మండిపడ్డారు. ‘‘బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వాళ్లు విమర్శిస్తున్నంతగా అక్కడేం లేదు. నద్వీ మా పార్టీ ఎంపీ. ఆయన మమ్మల్ని అక్కడికి ఆహ్వానించారు కాబట్టే వెళ్లాం. ఎలాంటి సమావేశాలు అక్కడ జరగలేదు. అసలు విషయాల్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఇలాంటి అంశాలను తెర మీదకు తెస్తోంది. బీహార్ ఓటర్ల అంశం, పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్ ఇవీ ముఖ్యమైన విషయాలు. వీటితో పాటు ప్రజా సమస్యలపై చర్చించేందుకు బీజేపీ సుముఖంగా లేదు. అందుకే ఈ అంశంతో రాజకీయం చేస్తోంది’’ అని అన్నారామె.
New Delhi: On the viral pictures of SP Chief and MP Akhilesh Yadav and others sitting in a mosque, Samajwadi Party MP Dimple Yadav says, "There is nothing like that. Our MP, Imam Sahab and his wife, all of us had gone there for a social event. No meeting took place there..." pic.twitter.com/AVW5ctYwEq
— IANS (@ians_india) July 23, 2025
ఇక.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకుని మరోసారి రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారాయన. తన భార్య డింపుల్ వస్త్రధారణ సవ్యంగానే ఉందని, కీలక అంశాలను పక్కదోవ పట్టించేందుకే అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ విమర్శలను ఇటు ఎస్పీతో పాటు అటు కాంగ్రెస్ నేతలు సైతం తిప్పి కొడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ బీజేపీవి సిగ్గులేని రాజకీయాలంటూ మండిపడ్డారు. డింపుల్ యాదవ్ వస్త్రధారణ భారతీయ సంప్రదాయాలకు తగ్గట్లే ఉందని, మహిళలను అవమానించే సంస్కృతి ఉన్న బీజేపీకి ఇలాంటి విమర్శలు సహజమేనని అన్నారాయన.