
ఓటర్ల హక్కులను కాలరాస్తున్నారంటూ పార్లమెంట్ బయట నిరసన తెలుపుతున్న విపక్ష ఎంపీలు రాహుల్, అఖిలేశ్, కనిమొళి తదితరులు
పార్లమెంట్‌లో కొనసాగిన విపక్షాల ఆందోళన
ఓటర్ల జాబితా సవరణ, ఆపరేషన్ సిందూర్‌పై వెంటనే చర్చించాలని పట్టు
చర్చకు తాము సిద్ధమని, సభకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి
పలుమార్లు వాయిదా పడిన ఉభయ సభలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు వరుసగా రెండో రోజు మంగళవారం సైతం అట్టుడికాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఆపరేషన్ సిందూర్ సహా పలు కీలక అంశాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. ఆపరేషన్ సిందూర్ సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం పదేపదే ప్రకటించినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. ఆయా అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తేచ్చిచెప్పాయి.మంగళవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతోపాటు పహల్గాం ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ప్రక్రియలో అమెరికా జోక్యం, నియోజకవర్గాల పునర్విభజన, దేశంలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మహిళలపై పెరుగుతున్న దౌర్జన్యాలు, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన, మణిపూర్ హింసాకాండ తదితర అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ సభకు హాజరై, వీటిపై సమాధానం ఇచ్చేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. విపక్షాల భేటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, మాణిక్కం ఠాగూర్, రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా తీర్మానాలు ఇచ్చారు.
విపక్ష ఎంపీల తీరుపై లోక్‌సభ స్పీకర్ ఆగ్రహం
లోక్‌సభ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. బిహార్ ఓటర్ల జాబితా సవరణతోపాటు ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ ప్లకార్డులు ప్రదర్శించాయి. నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించాయి. సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వ్యవసాయానికి సంబంధించిన కీలకమైన అంశాలు ఉన్నందు వీటిపై చర్చకు సహకరించాలని వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రతిపక్షాలను కోరారు. అయినప్పటికీ విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.
సభ పునఃప్రారంభమైన తర్వాత విపక్షాల ఆందోళన కొనసాగింది. స్పీకర్ స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ స్పందిస్తూ... విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సైతం మాట్లాడారు. సభకు సహకరించాలని విపక్ష సభ్యులను కోరారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభ తిరిగి 2 గంటల వరకు వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు ఆందోళన విరమించలేదు. వారి వైఖరిని స్పీకర్ తప్పుపట్టారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకురావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ జరగకుండా సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిడ్డారు. విపక్షాలు నిరసన కొనసాగించడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వాయిదా తీర్మానం నోటీసులను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించడం పట్ల విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. సభ తొలుత 12 గంటలకు వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఎగువ సభ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
ఓటర్ల హక్కులు కాలరాస్తున్నారు
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత విపక్ష ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం మెట్లపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.