
లక్నో : ఎండాకాలం పోయి నెలలు గడుస్తున్నా ఉక్కపోత ఏమాత్రం తగ్గడం లేదు. భూతాపం, వాతావరణ మార్పులు.. కారణమేదైనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేడికి విరుగుడుగా ఫ్యాన్లు, ఏసీలే అవసరమవుతున్నాయి. అయినా చల్లదనం రాకపోగా.. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. మరి.. ప్రత్యామ్నాయం? గంపెడు మట్టి, కాసింత సాంకేతికత అంటోంది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న యాంట్ స్టూడియో ఎల్‌ఎల్పీ!
మట్టి కుండలో ఉండే సహజసిద్ధమైన రంధ్రాల ద్వారా నీరు వ్యాకోచించి చల్లబడటం దీనికి కారణం. మట్టి కుండ స్థానంలో బోలెడన్ని మట్టి గొట్టాలు.. వాటిపై ధారగా నీళ్లు.. ఆ వెనుకనే చిన్న చిన్న ఫ్యాన్లు ఉన్నాయనుకోండి.. అతి తక్కువ ఖర్చుతో పనిచేసే ఎయిర్ కూలర్ సిద్ధమవుతాయని అంటున్నారు యాంట్ స్టూడియో వ్యవస్థాపకుడు, తెలుగు వాడైన సిరిపురపు మోనీశ్‌కుమార్. అనడం మాత్రమే కాదు.. ఇలాంటి సహజ సిద్ధమైన ఎయిర్ కూలర్లను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేస్తున్నారు. లక్నో వేదికగా జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్‌ఎఫ్)లో ఈ వినూత్న ఆలోచనను ప్రదర్శనకు పెట్టిన మోనీశ్‌ను ‘సాక్షి’పలకరించింది.