మసీదులో మహిళలు ప్రార్థన చేయొచ్చు | Sakshi
Sakshi News home page

మసీదులో మహిళలు ప్రార్థన చేయొచ్చు

Published Thu, Jan 30 2020 3:17 AM

Muslim women can pray at mosques - Sakshi

న్యూఢిల్లీ: మసీదుల్లోకి వచ్చి ముస్లిం మహిళలు ప్రార్థనలు చేయడం ఇస్లాంలో ఆమోదనీయమేనని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌(ఏఐఎంపీఎల్‌బీ) వెల్లడించింది. ముస్లిం పురుషుల మాదిరిగానే ముస్లిం మహిళలు కూడా నమాజ్‌ చేసేందుకు మసీదుకు రావొచ్చని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్‌ సమర్పించింది. మసీదుల్లోకి మహిళలను అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ యాస్మీన్‌ జుబేర్‌ అహ్మద్‌ పీర్జాదే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఏఐఎంపీఎల్‌బీ ఈ అఫిడవిట్‌ అందించింది. ఈ అంశాన్ని కూడా శబరిమల సహా మతపరమైన ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది.

‘ఇస్లాం గ్రంధాలు, ఇతర సంప్రదాయాలు, విశ్వాసాల ప్రకారం మసీదుల్లోకి మహిళలు వచ్చి నమాజ్‌ ఆచరించడం ఆమోదనీయమే. మహిళలు మసీదుల్లోకి స్వేచ్ఛగా రావొచ్చు. అలా రావాలా? వద్దా? అని నిర్ణయించుకునే హక్కు ఆ మహిళలకు ఉంది. ఈ విషయానికి సంబంధించి ఉన్న విరుద్ధమైన మతపర అభిప్రాయాలపై మేం స్పందించదలచుకోలేదు’ అని ఏఐఎంపీఎల్‌బీ ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. ముస్లిం మహిళలు కచ్చితంగా సామూహిక ప్రార్థనల్లో పాల్గొనాలని కానీ, శుక్రవారం ప్రార్థనల్లో పాలు పంచుకోవాలని కానీ ఏ నిబంధన ఇస్లాంలో లేదని ఏఐఎంపీఎల్‌బీ కార్యదర్శి మొహ్మద్‌ ఫజ్లుర్‌రహీమ్‌ తన న్యాయవాది షంషాద్‌ ద్వారా కోర్టుకు తెలిపారు. మసీదుల్లో కానీ, ఇంట్లో కానీ ప్రార్థన చేసే అవకాశం ఇస్లాం ముస్లిం మహిళలకు కల్పించిందన్నారు.

Advertisement
Advertisement