దరఖాస్తు చేయకుండానే ముంబైకర్‌కు రూ.1.2 కోట్ల వేతనం

Mumbai youth bags Rs 1.2 crore package at Google's London office - Sakshi

గూగుల్‌ సంస్థ ఆఫర్‌

ఇంజనీరింగ్‌ కుర్రాడి ఘనత

ముంబై: ఐఐటీ(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ల్లో చదివి ప్రఖ్యాత సంస్థల్లో రూ.కోట్ల వేతనాల కొలువులు పొందడం చూశాం. కానీ, అబ్దుల్లా ఖాన్‌(21) విషయం వేరు. ముంబైకి చెందిన ఈ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఏడాదికి రూ.1.2 కోట్ల వేతనంతో గూగుల్‌ సంస్థలో ఉద్యోగంలో చేరబోతున్నాడు..! ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయకుండానే ఈ ఘనత సాధించాడు. అదెలా? సౌదీ అరేబియాలో పాఠశాల విద్య పూర్తి చేసుకున్న అబ్దుల్లా ఖాన్‌ ముంబైకి వచ్చి ఐఐటీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు.

దీంతో ముంబై మీరా రోడ్డులో ఉన్న శ్రీ ఎల్‌ఆర్‌ తివారీ ఇంజినీరింగ్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. కంప్యూటర్‌ కోడింగ్‌ అంటే ఇష్టపడే అబ్దుల్లా.. ఉద్యోగం కోసమని కాకుండా, యథాలాపంగా గూగుల్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు తన ప్రొఫైల్‌ ఉంచాడు. దీనిని చూసి ఇంప్రెస్‌ అయిన గూగుల్‌ అధికారులు ఇంటర్వ్యూకు రమ్మంటూ మెయిల్‌ పంపారు. మొదట్లో దీనిని అబ్దుల్లా నమ్మలేదు. ఇలాంటి మెయిల్‌ తన స్నేహితుడి పరిచయస్తునికి కూడా రావడంతో వివరాలు తెలుసుకున్నాడు.

అనంతరం పలు విడతలుగా జరిగిన ఇంటర్వ్యూల్లో అబ్దుల్లా విజేతగా నిలిచాడు. దీంతోపాటు మార్చి మొదటి వారంలో లండన్‌లో జరిగిన ఫైనల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌లోనూ పాసయ్యాడు. దీంతో, సెప్టెంబర్‌లో లండన్‌లోని గూగుల్‌ కార్యాలయంలో ‘రిలయబిలిటీ ఇంజినీరింగ్‌ టీం’ సభ్యునిగా ఉద్యోగంలో జాయిన్‌ కావాలంటూ గూగుల్‌ నుంచి అబ్దుల్లాకు పిలుపొచ్చింది. ఏడాది వేతనం రూ.54.5 లక్షలు కాగా కంపెనీ బోనస్‌లో 15 శాతం, నాలుగేళ్లకు కలిపి రూ.58.9 లక్షల విలువైన కంపెనీ షేర్లు అతడికి అందుతాయి. ఇవన్నీ కలిపితే ఏడాదికి అతడికి అందే మొత్తం సుమారు రూ.1.2 కోట్లు అవుతుంది.

రూ.2 కోట్ల స్కాలర్‌షిప్‌
అమెరికాలోని ప్రఖ్యాత బోస్టన్‌ యూనివర్సిటీలో చదివేందుకు నోయిడాకు చెందిన ఆర్నవ్‌ మిశ్రా అనే విద్యార్థి ఎంపికయ్యాడు. బోస్టన్‌ వర్సిటీ ట్రస్టీ స్కాలర్‌షిప్‌పై చదివేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 20 మందిలో భారత్‌కు చెందిన ఏకైక విద్యార్థి మిశ్రా కావడం గమనార్హం. ట్రస్టీ స్కాలర్‌ షిప్‌ ఎంపిక పరీక్షలో 1,600 మార్కులకు గాను 1,500 మార్కులు, యూనివర్సిటీ స్కాలర్‌ షిప్‌ ఎంపిక పరీక్షలో 99 శాతం మార్కులు మిశ్రా సాధించాడు. దీంతో అతడు నాలుగేళ్లకు కలిపి దాదాపు రూ.2 కోట్ల మేర ఉపకార వేతనానికి ఎంపికయ్యాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top