బుర్ఖా నిషేధం.. చంపేస్తామని బెదిరింపులు

MES Group President Got Death Threat For Banned Face Veils - Sakshi

తిరువనంతపురం: కేరళలోని ఓ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎంఈఎస్) సంస్కరణలు పేరుతో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కోజికోడ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎంఈఎస్ తమ విద్యా సంస్థల పరిధిలో ముస్లిం విద్యార్థినుల బుర్ఖా వాడకంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలు జారీచేసిన సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఫజల్ గఫూర్‌ హత్యా బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ఇస్లాం సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఎంఈఎస్‌ నిర్ణయం తీసుకుందని, దానిని వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌కాల్‌ ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన సూచనలు మేరకు డ్రస్‌కోడ్‌ను నిర్ణయించుకునే హక్కు తమకు ఉందని, దానికి అనుగుణంగానే ఎంఈఎస్‌ విద్యాసంస్థల పరిధిలో బుర్ఖాని నిషేధించామని  పోలీసులు వద్ద వాపోయారు. కాగా  2019-20 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సొసైటీ ఫజల్ గఫూర్ దేశ వ్యాప్తంగా ఉన్న తమ విద్యాసంస్థల అధిపతులకు సర్క్యులర్ జారీచేసిన విషయం తెలిసిందే. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బంది కూడా ఈ నిబంధనను తప్పక పాటించాల్సిందేనన్నారు.

శ్రీలంకలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం గత నెల 21న ముస్లిం మహిళల బురఖా వినియోగాన్ని నిషేధించిందని, కానీ తాము అంతకు ముందే నిషేధం విధించామన్నారు. ఇదిలా ఉంటే దీనిపై కేరళ జామియాథుల్ ఉలేమా అధ్యక్షుడు సయ్యద్ ముహమ్మద్ జిఫ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుర్ఖాను నిషేధించాలన్న  వారి ఆదేశాలను ఇస్లాంకు, షరియత్‌ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top