
ప్రసూతి చట్టం-2017కు రాష్ట్రపతి ఆమోదముద్ర
ప్రసూతి సెలవులను 12 వారాలు నుంచి 26 వారాలకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ప్రసూతి చట్టం-2017కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదమూద్ర వేశారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఉద్యోగులకు శుభవార్త. ప్రసూతి సెలవులను 12 వారాలు నుంచి 26 వారాలకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన ప్రసూతి చట్టం-2017కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదమూద్ర వేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 18లక్షల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ చట్టం ద్వారా ప్రపంచంలో ప్రసూతి సెలవులు ఎక్కువ ఇచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది. కొత్త చట్టం ప్రకారం 50 లేదా అంత కంటే ఎక్కువ మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థలు వారి పిల్లల కోసం ఖచ్చితంగా ప్రత్యేక సదూపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఉద్యోగులు తమ పిల్లలను రోజుకు నాలుగుసార్లు కలుసుకునే వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. పరస్పర అంగీకారంతో ప్రసూతి సెలవుల రోజుల్లో మహిళలు ఇంటినుంచి పనిచేసే అవకాశం పొందవచ్చు. పది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు మొదటి రెండు కాన్పులకు 26 వారాలు ఆ తరువాత కాన్పులకు 12 వారాలు సెలవులు తీసుకొవచ్చు. 3నెలలు లోపు పిల్లలను దత్తత తీసుకున్న, ఇచ్చిన వారికి12వారాలు సెలవులు మంజూరు చేయాలి.