
మహిళల ఉపాధి రేటు గత 7ఏళ్లలో దాదాపు రెట్టింపైనట్లు కార్మిక శాఖ తాజాగా పేర్కొంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2017 - 18లో స్త్రీల ఉపాధి రేటు 22 శాతంకాగా.. 2023–24కల్లా 40.3 శాతానికి ఎగసింది. మరోపక్క ఇదే కాలంలో నిరుద్యోగ రేటు 5.6 శాతం నుంచి 3.2 శాతానికి దిగివచ్చింది. 2047కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 70 శాతానికి చేరుకోవడం కీలకంగా నిలవనున్నట్లు తెలియజేసింది.
నియమితకాల శ్రామిక శక్తి సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్) గణాంకాల ప్రకారం గత 7ఏళ్లలో మహిళా ఉపాధి రేటు(డబ్ల్యూపీఆర్) దాదాపు రెట్టింపైంది. వెరసి భారత్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య ప్రస్తావించదగిన స్థాయిలో బలపడింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ రేటు(యూఆర్) సైతం 2017–18లో నమోదైన 5.6 శాతం నుంచి 2023 - 24కల్లా 3.2 శాతానికి వెనకడుగు వేసింది. ఇది స్త్రీలకు పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలను ప్రతిబింబిస్తున్నట్లు కార్మిక శాఖ పేర్కొంది.
గ్రామాలలో ఇది మరింత అధికంగా బదిలీ అయినట్లు వెల్లడించింది. పట్టణాలలో ఉపాధి రేటు 43 శాతంకాగా.. గ్రామీణంలో మహిళా ఉద్యోగుల రేటు 96 శాతం జంప్‌చేసినట్లు తెలియజేసింది. 2025 భారత నైపుణ్య నివేదిక ప్రకారం దేశీ గ్రాడ్యుయేట్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55 శాతంమందికి ఈ ఏడాది ఉపాధి లభించనున్నట్లు పేర్కొంది. 2024లో ఇది 51.2 శాతంగా నమోదైంది.