
మహిళలకు తిరుగులేని ఆయుధంగా పాష్ చట్టం
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదులు
బీఎస్‌ఈ–30 సంస్థల్లో ఏడాదిలో 958 ఫిర్యాదులు
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో టాప్–30 సంస్థలలో.. గతేడాది లైంగిక వేధింపుల ఫిర్యాదుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మహిళా ఉద్యోగులు తమ సమస్యల గురించి గొంతు విప్పేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారనడానికి ఇది సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క సంస్థలు కూడా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. 2023–24లో వచ్చిన ఫిర్యాదుల్లో 88 శాతం పరిష్కారం కావడమే ఇందుకు నిదర్శనం. – సాక్షి, స్పెషల్ డెస్క్
బీఎస్‌ఈలోని టాప్–30 కంపెనీలకు.. తమ మహిళా ఉద్యోగుల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో లైంగిక వేధింపులకు సంబంధించి మొత్తం 958 ఫిర్యాదులు అందాయి. 2023–24లో వీటి సంఖ్య 902. అంటే ఏడాదిలో ఫిర్యాదుల సంఖ్య 6.2 శాతం పెరిగింది. ఫిర్యాదుల్లో పెరుగుదలకు ‘పాష్’ చట్టమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.
ఏమిటీ పాష్ చట్టం?
ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్‌మెంట్ (పాష్) యాక్ట్‌ను అధికారికంగా ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013’ అని పిలుస్తారు. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదుల స్వీకారానికి వ్యవస్థలను ఏర్పాటుచేసి కంపెనీలు ఊరుకోవడం లేదు.
ఫిర్యాదుల పట్ల కూడా సీరియస్‌గానే వ్యవహరిస్తున్నాయి. వాటి పరిష్కారం కోసమూ చర్యలు చేపడుతున్నాయి. 2023–24లో టాప్–30 బీఎస్‌ఈ కంపెనీలలో పాష్ కింద నమోదైన 902 కేసుల్లో 88% పరిష్కారం అయ్యాయని లైంగిక వేధింపుల నివారణపై కంపెనీలకు సలహాలు ఇస్తున్న ‘కంప్లైకరో’ అనే సంస్థ తెలిపింది. ‘ఇది గొప్ప మార్పునకు సూచిక’ అని మహిళా ఉద్యోగులు చెబుతున్నారు.
ప్రభుత్వ పర్యవేక్షణ
భారత ప్రభుత్వ షీ–బాక్స్ పోర్టల్‌లో అన్ని కంపెనీలు (పెద్దవి లేదా చిన్నవి) తమ అంతర్గత ఫిర్యాదుల కమిటీలను నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. అలాగే నిబంధనల అమలును పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో కార్మిక కమిషనర్లు సర్వేలు చేయాలని ఆదేశించింది. అన్ని కంపెనీలు ఒకేచోట నమోదు కావడంతో షీ–బాక్స్ పోర్టల్‌లో బాధితులు తమ పాష్ ఫిర్యాదును దాఖలు చేయడం సులభతరమైంది.
విచారణ ప్రక్రియను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందనే విషయం ఉద్యోగికి మరింత ధైర్యం, ఊరటనిస్తుందని నిపుణులు అంటున్నారు. పాష్ ఫిర్యాదులు, నిబంధనల అమలులో ప్రస్తుత సంవత్సరం ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని విశ్వసిస్తున్నట్టు కంప్లైకరో వెల్లడించింది. పాష్ చట్టాన్ని పాటించడానికి పెద్ద కంపెనీలే కాదు, ఎంఎస్‌ఎంఈలు కూడా ముందుకు వచ్చాయి. ఈ కంపెనీల నుంచి రోజుకు సగటున 7–8 ఫిర్యాదులు వస్తున్నాయని వివరించింది.
అవగాహన పెరిగింది
పాష్ ఫిర్యాదులు పెరగడం అంటే.. పని ప్రదేశాల్లో సమస్యల పట్ల బాధితులు తమ గొంతు వినిపించడానికి ధైర్యంగా ముందుకు రావడమేనని హెచ్‌ఆర్ నిపుణులు అంటున్నారు. ‘సంవత్సరాలుగా బాధితులు నిశ్శబ్దంగానే ఉన్నారు. పాష్ పట్ల మహిళల్లో అవగాహన పెరిగింది. తాము ఎదుర్కొంటున్న వేధింపులకు పరిష్కారం దొరుకుతుందన్న విశ్వాసం పెరుగుతోంది. అందుకే ధైర్యంగా ఎక్కువ మంది ఈ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు’ అని వారు చెబుతున్నారు.
బ్యాంకుల నుంచే ఎక్కువ
ఆసక్తికర విషయం ఏమంటే బీఎస్‌ఈ టాప్–30 కంపెనీల్లో గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఫిర్యాదులలో బ్యాంకు ఉద్యోగుల నుంచి 34% ఫిర్యాదులు వస్తే, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది నుంచి 31.5% వచ్చాయి. మూడింట రెండు వంతులు లేదా 627 ఫిర్యాదులు ఈ రెండు రంగాల నుంచే అందాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గరిష్టంగా 125 ఫిర్యాదులను అందుకుంది. 2023–24లో ఈ సంస్థలో 110 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ 117 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఫిర్యాదుల పరంగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
