సినిమా పోస్టర్‌ నిజమై నటుడు మృతి!

Man Dies After His Cinema Promotion In Tamilnadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: సినిమా ప్రచారం కోసం వీధుల్లో వేసిన చావు పోస్టర్‌ నిజమై పోస్టర్‌లో ఉన్న వర్ధమాన నటుడు నిజంగానే మరణించిన చిత్రమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తూత్తుకూడి జిల్లా కాయల్‌పట్టినంకు చెందిన ఆర్‌ఎస్‌ గోపాల్‌ (52) అనే వ్యక్తి వంటపని, శుభ, అశుభ కార్యక్రమాలకు షామియానా, సామాన్లు సరఫరా చేసే వృత్తులు నిర్వహిస్తుంటాడు. ‘గరిట నుంచి గజరాజు వరకు అన్నీ దొరకును’ అనే చిత్రమైన నినాదంతో బోర్డు ఏర్పాటు చేయడం, మనిషి రూపురేఖలు కూడా బాగుండడంతో సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇటీవల అతడు ఒక సినిమాలో విలన్‌గా నటించగా, ఆ సినిమాలో అతను చనిపోవడం, ‘కన్నీటి అంజలి’ అంటూ వీధుల్లో పోస్టర్లు వెలియడం లాంటి దృశ్యాలను చిత్రీకరించారు. ఈ దృశ్యాలను గోపాల్‌ వాట్సాప్‌ ద్వారా సరదాగా బంధుమిత్రులకు పంపాడు. ఆవేదన చెందిన వారంతా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పూలమాలలు తీసుకుని అతని ఇంటికి చేరుకోగా గోపాల్‌ హాయిగా కుర్చీ వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ కూర్చుని ఉన్నాడు.

అవన్నీ తన కొత్త సినిమా కోసం చిత్రించిన దృశ్యాలని వారికి వివరించి, తన ఇంటి గోడకు అతికించి ఉన్న ‘కన్నీటి అంజలి’ పోస్టర్లను వారి ముందే చించుతూ ఫోజిచ్చి పంపివేశాడు. వారం రోజుల క్రితం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా, గోపాల్‌ మరణించినట్లు శనివారం నాడు మరలా ఊరంతా పోస్టర్లు వెలియడంతో ఇది కూడా సినిమా ప్రచారమేనని అందరూ భావించారు. అయితే కొందరు అనుమానంతో వారింటికి ఫోన్‌ చేయగా అనారోగ్య కారణాల వల్ల గోపాల్‌ మృతి చెందినట్లు బంధువులు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. తన చావు పోస్టర్లను తానే ప్రచారం చేసుకున్న వారం రోజులకు గోపాల్‌ నిజంగానే మరణించిన ఆశ్చర్యకరమైన ఘటన తమిళనాడులో చర్చనీయాంశమైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top