
దేశమంతా చంద్రుడిపై క్రాస్ ల్యాండ్ అయిన ల్యాండర్ విక్రమ్ జాడకోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఓ వ్యక్తి మాత్రం మరో అడుగు ‘పైకి’ వేశాడు.
ప్రయాగ్‌రాజ్ : దేశమంతా చంద్రుడిపై క్రాస్ ల్యాండ్ అయిన ల్యాండర్ విక్రమ్ జాడకోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఓ వ్యక్తి మాత్రం మరో అడుగు ‘పైకి’ వేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని న్యూ యమునా బ్రిడ్జిపై ఉన్న ఓ భారీ పిల్లర్ ఎక్కి కూర్చున్నాడు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ల్యాండర్ విక్రమ్ ఆచూకీ కనుగొనేంత వరకు దిగేది లేదని స్పష్టం చేశాడు. అతన్ని ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని మండ ప్రాంతానికి చెందిన రజనీకాంత్‌గా గుర్తించారు. త్రివర్ణ పతాకం చేతపట్టుకుని సోమవారం రాత్రి రజనీకాంత్ పిల్లర్‌పైకి పైకి చేరాడని స్థానికులు చెప్తున్నారు.
ఇదిలాఉండగా.. చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా సెప్టెంబర్ 7న చంద్రుడికి చేరువగా వెళ్లిన ల్యాండర్ విక్రమ్ ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. ఇక విక్రమ్‌తో సంబంధాల పునరురద్ధరణకు గత పదకొండు రోజులుగా బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ సెంటర్‌లో శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. మొదటి నుంచీ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిముషంలో సంక్లిష్టంగా మారింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్ విక్రమ్ గల్లంతైన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతో పాటు, యావత్ భారతం ఇస్రోకు మద్దతుగా నిలిచింది. ఇక ఇస్రోకి సాయమందించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ముందుకొచ్చింది.