
కోల్‌కతా: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఐదుగురు సినీ ప్రముఖులకు చోటు కల్పించారు. 2011లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ సినీ ఆర్టిస్టులకు ప్రాధాన్యమిస్తోంది. తాజాగా అదే ఒరవడి కొనసాగిస్తూ మంగళవారం విడుదల చేసిన జాబితాలో నటీమణులు నుస్రాత్ జహాన్(బసీరాత్), మిమి చక్రవర్తి(జాదవ్‌పూర్), శతాబ్ది రాయ్(బిర్భూమ్), మూన్‌మూన్ సేన్(అసాన్‌సోల్), నటుడు దేవ్(ఘటల్)లకు టికెట్లు ఇచ్చారు. మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం మమతా బెనర్జీ 10 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్ ఇవ్వలేదు. 18 మంది కొత్త ముఖాలకు చోటు కల్పించారు. 17 మంది మహిళల(41 శాతం)కు సీట్లు కేటాయించారు.
ముగ్గురు తృణమూల్ నాయకులు బీజేపీ గూటికి..
టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ అనుపమ్ హజ్రాతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో హజ్రా బోల్పూర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గతంలో బహిష్కరించారు.