వారు చాలా కష్టపడ్డారు : మమతా బెనర్జీ | Sakshi
Sakshi News home page

వారు చాలా కష్టపడ్డారు : మమతా బెనర్జీ

Published Sat, Sep 7 2019 4:18 PM

Mamata Banerjee Praise For ISRO For Moon Mission Chandrayaan 2 - Sakshi

సాక్షి, కోల్‌కతా : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలుస్తున్నారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సజావుగా సాగిన విక్రమ్‌ ల్యాండర్‌ ప్రయాణంలో కుదుపులు చోటుచేసుకున్నప్పటికీ శాస్త్రవేత్తల శ్రమకు ఎప్పటికైనా ఫలితం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో చంద్రయాన్‌ 2 ప్రయోగంపై మోదీ ప్రభుత్వం అతి చేస్తోందని విమర్శించిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలిచారు. చంద్రయాన్‌ 2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చాలా కష్ట పడ్డారని ప్రశంసించారు. వారి కష్టం ఎప్పటికీ వృథా కాదన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్‌ చేశారు. ‘ఇస్రో శాస్త్రవేత్తల పనితీరు మాకు గర్వంగా ఉంది. చంద్రయాన్‌-2 కోసం చాలా కష్ట​ పడ్డారు. శాస్త్ర-సాంకేతిక  రంగంలో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిపిపేందుకు పునాది వేసిన ఇస్రో వ్యవస్థాపకులకు ఇవే నా నివాళులు’  అంటూ మమతా ట్విట్‌ చేశారు. 

(చదవండి : చంద్రయాన్‌ టెన్షన్‌.. అందినట్టే అంది)

ఇస్రో శాస్త్రవేత్తల  శ్రమ వృథాపోదని, ఈ ప్రయోగం ఎన్నో ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనలకు పునాదిగా నిలుస్తుందని ప్రశసించారు. భారతీయులంతా ఇస్రో శాస్త్ర వేత్తలకు అండగా ఉన్నామని, ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేసి దేశానికి గొప్ప పేరుతేవాలని అంటూ మరో ట్విట్‌ చేశారు.

కాగా, శుక్రవారం బెంగాల్‌లో అసెంబ్లీలో మమతా మాట్లాడుతూ.. చంద్రయాన్‌ 2 ప్రయోగంపై నరేంద్ర మోదీ అతి చేస్తున్నారని విమర్శించారు. దేశంలో  ఇదే తొలి ప్రయోగం అయినట్టు, మోదీ అధికారంలోకి రాకముందు ఇలాంటివేవీ జరగనట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారని మమతా బెనర్జీ ఆక్షేపించారు. దేశంలో ఆర్థిక విపత్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రధాని మోదీ చంద్రయాన్ 2 ప్రయోగాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement