ఏడో రోజుకు లారీల సమ్మె | Sakshi
Sakshi News home page

ఏడో రోజుకు లారీల సమ్మె

Published Thu, Apr 6 2017 2:33 AM

ఏడో రోజుకు లారీల సమ్మె - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పలు డిమాండ్లతో లారీ యజమానుల సంఘాలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. రాష్ట్రంతోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. పలు అత్యవసర సరుకుల రవాణా మాత్రమే జరుగుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వనస్థలిపురం, మూసాపేట, ఔటర్‌రింగ్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో లారీలను ఆపేశారు. ఇటీవల ఐఆర్‌డీఏతో జరిపిన చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు తెలంగాణ లారీ యజమానుల సంఘం, దక్షిణాది లారీ యజమానుల సంఘం కార్యాచరణకు సన్నద్ధమవుతున్నాయి.

ఈ మేరకు జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సమ్మెను విస్తృతం చేసేందుకు అన్ని రాష్ట్రాల లారీ యాజమాన్య సంఘాలు సన్నద్ధమైనట్లు వెల్లడించారు. గురువారం (6వ తేదీ) నుంచే అత్యవసరాలైన పాలు, కూరగాయలు, మందులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ వంటివాటి సరఫరాను నిలిపివేయాలని భావించినా.. పెట్రోలియం లారీ సంఘాలతో సంప్రదింపులు జరుగుతున్న దృష్ట్యా కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియమే ప్రధానం!
లారీలకు థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం పెంపును నిలిపివేయాలనే ప్రధానమైన డిమాండ్‌తో దేశవ్యాప్తంగా లారీల సమ్మెను చేపట్టారు. దాంతో పాటు తెలుగు రాష్ట్రాలకు వర్తించే విధంగా సింగిల్‌ పర్మిట్లను ఇవ్వాలని, టోల్‌ట్యాక్స్‌ల భారాన్ని తొలగించాలని లారీ సంఘాలు కోరుతున్నాయి. 41 శాతం పెంచిన థర్డ్‌ పార్టీ ప్రీమియాన్ని తగ్గించడంపై రెండు రోజుల కింద ఐఆర్‌డీఏ చైర్మన్‌ విజయన్‌తో బషీర్‌బాగ్‌ పరిశ్రమల భవన్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ పెంపును నిలిపివేయడం సాధ్యం కాదని, దీనిపై చర్చించేందుకు లారీ సంఘాలతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని విజయన్‌ పేర్కొన్నారు. కానీ బీమా ప్రీమియం పెంపును నిలిపివేస్తే తప్ప తాము కమిటీకి ప్రాతినిధ్యం వహించబోమంటూ లారీ సంఘాలు చర్చల నుంచి బయటకు వచ్చాయి.

స్తంభించిన నిత్యావసరాల సరఫరా
హైదరాబాద్‌కు నిత్యావసరాలను సరఫరా చేసేసుమారు 5,000 లారీలు సమ్మె కారణంగా నిలిచిపోయాయి. బియ్యం, పప్పులు, ఉల్లి, సిమెంట్, స్టీల్, బొగ్గు, ఇసుక తదితరాల రవాణా పూర్తిగా స్తంభించింది. స్థానికంగా డీసీఎం వ్యాన్ల ద్వారా కొన్ని రకాల వస్తువులను సరఫరా చేస్తున్నారు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు రవాణా నిలిచిపోవడంతో బియ్యం, పప్పులు వంటి నిత్యావసరాల ధరలు 15 శాతం వరకు పెరిగాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement