ఎన్నికల వేళ కొత్త పార్టీ | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ కొత్త పార్టీ.. వారికి చెక్‌ పెట్టేందుకేనా?!

Published Fri, Nov 16 2018 4:25 PM

UP Leader Raja Bhaiya Likely To Announce New Party - Sakshi

లక్నో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని నగరాల పేర్లు మారుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దూకుడు ప్రదర్శిస్తుండగా, బీజేపీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నప్పటికి ఎస్పీ, బీఎస్పీలు పొత్తుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వతంత్ర ఎమ్మెల్యే, ఠాకూర్‌ నేత రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌ అలియాస్‌ రాజా భయ్యా కొత్త పార్టీ పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎస్పీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన రాజా భయ్యా శుక్రవారం తాను పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఇప్పటిదాకా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి గెలుపొందానని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. త్వరలోనే ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి పార్టీ పేరును రిజిస్టర్‌ చేయిస్తానని పేర్కొన్నారు.

వారికి రిజర్వేషన్లు అక్కర్లేదు..
‘రిజర్వేషన్‌ కోటాలో ఉద్యోగం పొందిన సివిల్‌ సర్వెంట్లు రిజర్వేషన్‌ను వదులుకుంటే బాగుంటుంది. వారికి ఒకసారి ఆ ఫలాలు అందాయి కాబట్టి ఎంతోకొంత ఆర్థిక స్వాలంబన లభిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్‌ వదులుకుంటే వాళ్ల కమ్యూనిటీలోనే ఉన్న మరికొంత మంది నిరుపేదలకు లబ్ది చేకూరుతుంది’ అని రాజా భయ్యా వ్యాఖ్యానించారు. ఇక పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. కుల ప్రాతిపదికన కాకుండా ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఏదైనా ఒక ఘటనలో బాధితులు దళితులా లేదా మరే ఇతర సామాజిక వర్గానికి చెందిన వారా అనే తేడా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించినపుడే సమన్యాయం పాటించినట్లు అవుతుందని పేర్కొన్నారు.

ఎస్పీ- బీఎస్పీ ఓట్లు చీల్చేందుకేనా?
అయితే ఇన్నాళ్లుగా అఖిలేశ్‌ యాదవ్‌కు సన్నిహితుడిగా మెదిలిన రాజా భయ్యా ప్రస్తుతం బీజేపీ అధినాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించిన సమయంలో... రిజర్వేషన్ల గురించి మాట్లాడిన తీరు చూస్తే రాజా భయ్యా పార్టీ అనుసరించే విధానాలు ఎలా ఉండబోతున్నాయో అర్థమవుతుందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అగ్రవర్ణాల మెప్పు పొందేందుకే ఆయన ఇలా మాట్లాడారని, ఆయన మాటల్లో బీజేపీ ప్రభావం స్పష్టంగా కనబడుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎస్పీ-బీఎస్పీ ఓట్లు చీల్చేందుకే రాజా భయ్యా చేత బీజేపీ కొత్త పార్టీ పెట్టించిందనే వాదనలూ విన్పిస్తున్నారు.

Advertisement
Advertisement