ఉద్యోగులపై కుమార స్వామి ఫైర్‌

Kumaraswamy angry with workers for voting for Modi - Sakshi

బెంగళూరు/రాయచూరు రూరల్‌: తమ ఫిర్యాదుల ను ఇచ్చేందుకు రాయ్‌చూర్‌ జిల్లా యెర్మారస్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌) ఉద్యోగులు సీఎం హెచ్‌డీ కుమార స్వామి వెళ్తున్న కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగుల తీరుపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ‘గ్రామ వాస్తవ్య’కార్యక్రమంలో భాగంగా కుమారస్వామి రాయ్‌చూర్‌కి వెళ్లారు. ‘మీరు నరేంద్ర మోదీకి ఓటు వేశారు. కానీ మీ పనులను నేను చేయాలనుకుంటున్నారు. నేను మీకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీపై లాఠీ చార్జ్‌ చేయాలా? ఇక్కడి నుంచి వెళ్లిపోండి’అని వైటీపీఎస్‌ ఉద్యోగులపై కుమార స్వామి గట్టిగా అరిచారు.

దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అనంతరం కుమార స్వామి ఓ టీవీ చానల్‌లో మాట్లాడుతూ ‘ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి 15 రోజుల సమయం కావాలని కోరాను. అయినప్పటికీ వారు నేను వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో నేను సహనం కోల్పోయాను’అని తెలిపారు. ఒక వేళ ప్రధాన మంత్రి కాన్వాయ్‌ను ఎవరైనా అడ్డుకుంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ‘మా ప్రభుత్వం సహనంతో ఉంది. కానీ అసమర్థమైంది మాత్రం కాదు. పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు’అని పేర్కొన్నారు. గ్రామ వాస్తవ్య కార్యక్రమంలో భాగంగా సీఎం రాయ్‌చూర్‌ జిల్లా కరేగుడ్డలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో రాత్రి గడపనున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top