కథువా రేప్‌ కేసు లాయర్‌కు బెదిరింపులు

Kathua Rape Victim Lawyer Says Not Afraid Of Threats - Sakshi

జమ్మూ : ‘న్యాయ వ్యవస్థపై, లాయర్లపై ప్రజలకు విశ్వాసం పోకుండా ఉండాలంటే వారి చేతుల్లో కూడా న్యాయదండాలు ఉండాలేమో!’ అని కశ్మీర్‌లోని కథువా జిల్లాలో దారుణంగా సామూహిక అత్యాచారానికి, ఆపై హత్యకు గురైన ఎనిమిదేళ్ల ముస్లిం బాలిక తరఫున కేసును వాదిస్తున్న దీపికా సింగ్‌ రజావత్‌ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య ఇది. బాలిక కేసును వాదించకుండా, ఆ కేసులో చార్జిషీటు దాఖలు కాకుండా ఆమెకు బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో ఆమె అసహనంతో ఈ వ్యాఖ్య చేశారు. ఆమెకు బెదిరింపులు ఎదురైనవి ఎవరి నుంచో కావు. సాక్షాత్తు జమ్మూ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భూపిందర్‌ సింగ్‌ సతాథియా నుంచి.

ఈ కేసులో చార్జిషీటు దాఖలు కాకుండా మొదటి నుంచి అడ్డుకుంటున్న భూపిందర్‌ సింగ్‌ ఏప్రిల్‌ నాలుగవ తేదీన తనను తీవ్రంగా బెదిరించినట్లు, అవమానకరంగా మాట్లాడినట్లు ఆమె ఆ తర్వాత తన ఫేస్‌బుక్‌ పేజీలో వెల్లడించారు. తాను ఎవరి పక్షం కానని, హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు... అందరి కేసులను వాదిస్తానని చెప్పారు. పిల్లలకు జరిగే అన్యాయం ఎంత దారుణంగా ఉంటుందో తాను ఊహించగలనని, తనకు ఓ ఐదేళ్ల పాప ఉందని, భూపిందర్‌ సింగ్‌కు కూడా ఓ పాప ఉండే ఉంటుందని ఆమె అన్నారు. బాలిక గ్యాంగ్‌ రేప్‌ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బుధవారం నాడు జమ్మూలో బంద్‌ నిర్వహించిన హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ గురువారం నాడు కూడా తన ఆందోళనను కొనసాగించింది.

బాలిక రేప్‌ కేసును స్థానిక క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు సవ్యంగానే దర్యాప్తు జరుపుతున్నారని, కేసును మసిపూసి మారేడు కాయ చేయడం కోసమే నేడు కేసును సీబీఐకి అప్పగించాలని బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తున్నదని రజావత్‌ ఆరోపించారు. తనను బెదిరించడంపై తాను జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top