వందో సమస్య

Karnataka bans riding pillion on 2 wheelers below 100 cc capacity

100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యమున్న బైక్‌లపై ఆంక్షలు

ఇక వెనుక మరొకరు కూర్చోరాదు ∙మధ్య తరగతి కుటుంబాలపై భారం

పెరగనున్న ట్రాఫిక్, కాలుష్యం బెడద

నగరానికి చెందిన విఘ్నేష్‌ ఓ సంస్థలో చిరుద్యోగి. అతని భార్య కూడా ఉద్యోగిని. విఘ్నేష్‌ కార్యాలయానికి వెళ్లే దారిలోనే అతని భార్య పనిచేసే కార్యాలయం కూడా ఉంది. దీంతో ప్రతిరోజూ తన వద్ద ఉన్న చిన్న బైక్‌ పై భార్యను కూడా తీసుకెళ్లి ఆఫీసు వద్ద వదిలి, తిరిగి వచ్చేటపుడు భార్యను తీసుకొని ఇంటికి వస్తుంటాడు. తన వద్ద ఉన్న బైక్‌ పాతదయిపోయి ఎక్కువగా రిపేర్లు వస్తుండడంతో దానిని పక్కనపెట్టి కాస్తకాస్తగా కూడబెట్టిన సొమ్ముతో 100సీసీ సామర్థ్యం ఉన్న బైకును కొనాలని భావించాడు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో అతని ఆలోచన తలకిందులైంది. 100 సీసీ బైకును కొంటే భార్యను ఆఫీసుకు తీసుకెళ్లేందుకు వీలుకాదు. అలాగని అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకును కొనాలంటే అందుకు తన బడ్జెట్‌ సహకరించదు. ఎలాగనే ఆలోచనలో పడ్డాడు.... బెంగళూరులోను, రాష్ట్రంలోనూ ఇప్పుడు చాలామందికి ఇదే అంతర్మథనం.

సాక్షి, బెంగళూరు: 100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై పిలియన్‌ రైడర్‌ని నిషేధిస్తూ రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణ వేత్తలు ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం కారణంగా నగర రోడ్లపై ద్విచక్ర వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, తద్వారా నగరంలో వాయు కాలుష్యం కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సగటుజీవి ఆవేదన
కొత్తగా కొనాలంటే 100సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలనే కొనాల్సి ఉంటుందని, అయితే ఇందుకు తమ కుటుంబ బడ్జెట్‌ సహకరించదనేది మధ్యతరగతి వర్గాల వాదన. అలా కాకుండా 100సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకును కొంటే కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కో బైకును కొనాల్సి ఉంటుంది. ఇది కూడా సాధ్యమా? అని ప్రశ్నిస్తున్నారు. 100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై పిలియన్‌ రైడర్‌ని నిషేధించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చనేది ప్రభుత్వం వాదన. అయితే ప్రమాదాలను నివారించడం ఎలా ఉన్నా ప్రభుత్వ నిర్ణయం కారణంగా నగరంలో  ట్రాఫిక్‌ రద్దీ మరింతగా పెరుగుతుందనే ఆదుర్దా వ్యక్తమవుతోంది.

ప్రజా వ్యతిరేకత వస్తే సమీక్షిస్తాం ∙‘100 సీసీ’ నిర్ణయంపై మంత్రి రేవణ్ణ
సాక్షి, బెంగళూరు: హైకోర్టు ఆదేశాల ప్రకారమే 100సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన బైకులపై పిలియన్‌ రైడర్‌ను నిషేధించామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి హెచ్‌.ఎం.రేవణ్ణ వెల్లడించారు. మంగళవారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన బైకులపై పిలియన్‌ రైడర్‌ ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది. కర్ణాటక మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ కూడా ఇదే చెబుతోంది. ప్రమాదాల్లో బీమా కూడా చెల్లించబడదు. అందుకే కోర్టు ఆదేశాలను పాటించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు ఈ ఆదేశాలు కొత్త వాహనాలకు మాత్రమే అన్వయించబడతాయి. ఇందులో ప్రభుత్వ ఆసక్తి ఏదీ లేదు. ఈ నిర్ణయం పై ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమైతే ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచిస్తాం.’ అని హెచ్‌.ఎం.రేవణ్ణ తెలిపారు.  

మరింతగా కాలుష్యం బెడద
‘సాధారణంగా పేద, మధ్యతరగతికి చెందిన ప్రజలు ఎక్కువగా 100 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులనే కొంటూ ఉంటారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఎక్కువగా వారే ఇబ్బంది పడతారు. ఇక ఒక్కో వ్యక్తి ఒక్కో బైకును కొనుగోలు చేస్తే నగరంలో కాలుష్యం కూడా మరింతగా పెరిగిపోతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది     అన్న చందంగా ఉంది ’ – పర్యావరణ కార్యకర్త విజయ్‌ నిశాంత్‌

కొత్త వాహనాలకు మాత్రమే అమలు
‘హైకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాల సామర్థ్యం 100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై పిలియన్‌ రైడర్‌కి అవకాశం లేదు. అలాంటి వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు కూడా వీలు లేదు. కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వాహనాలకు మాత్రమే కొత్త నిబంధనలు అమలవుతాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయిన వాహనాలపై నిషేధం ఏమీ లేదు’
– రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ బి.దయానంద్‌

ఆ వాహనాల పరిస్థితేమిటి?
ఈ సమస్యపై నగరంలోని ఓ వాహన షోరూమ్‌ యజమాని మాట్లాడుతూ.....‘దీపావళి సందర్భంగా ఎక్కువ మంది 100సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులను ఎక్కువగా కొనుగోలు చేశారు. వీటిలో 50 శాతం మేర వాహనాల రిజిస్ట్రేషన్‌ ఇంకా పూర్తి కాలేదు. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా వారందరూ నష్టపోవాల్సిందేనా. ఇప్పటికిప్పుడు ఆ బైక్‌ల సీటింగ్‌ విధానాన్ని మార్చడం కూడా వీలుకాదు’ అని వాపోయారు. – వాహన డీలర్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top