జడ్జి 'తలాక్' అన్నారని.. సీజేఐకి ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

జడ్జి 'తలాక్' అన్నారని.. సీజేఐకి ఫిర్యాదు

Published Sat, Feb 13 2016 9:20 AM

జడ్జి 'తలాక్' అన్నారని.. సీజేఐకి ఫిర్యాదు

తనను రెండోపెళ్లి చేసుకున్న జడ్జిగారు 'తలాక్.. తలాక్.. తలాక్' అన్నాడని కోపం వచ్చి ఆయన భార్య.. దీని గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసింది. అలీగఢ్ అదనపు జిల్లా జడ్జి మహ్మద్ జహీరుద్దీన్ సిద్దిఖీ (59)కి ఎందుకోగానీ తన భార్య అఫ్షాఖాన్ మీద కోపం వచ్చింది. అంతే తలాక్.. అంటూ విడాకులు ఇచ్చేశానన్నాడు. అందరికీ న్యాయం చెప్పాల్సిన స్థానంలో ఉన్న తన భర్త.. సొంత భార్యకే అన్యాయం చేశాడంటూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. జడ్జి, ఆయన కుటుంబ సభ్యులు తనను చిత్రహింసలు పెట్టారని, వాళ్లను జైల్లో పెట్టి సమాజానికి మంచి సందేశం పంపాలని కోరింది.

తమ మధ్య రాజీక కుదరలేదని, అందుకే షరియా చట్టం ప్రకారం ఆమెకు విడాకులు ఇచ్చానని జడ్జి సిద్దిఖీ చెప్పారు. 2015 ఏప్రిల్ 16న అలీగఢ్‌లోని ఓ హోటల్లో అష్ఫా, సిద్దిఖీల పెళ్లి జరిగింది. దానికి ఆయన మొదటి భార్య కొడుకులతో సహా బంధువులందరూ హాజరయ్యారు. అయితే ఆ తర్వాతి నుంచి తనను విపరీతంగా బెదిరించారని ఆమె చెప్పింది. తాను సామాన్యుడిని కానని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తనతో పాటు తన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు కూడా తర్వాతి పరిణామాలను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని బెదిరించారని తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో పాటు, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మతీన్ అహ్మద్‌కు, లక్నోబెంచికి, అలీగఢ్ జిల్లా జడ్జికి కూడా ఆమె ఫిర్యాదు చేసింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement