కశ్మీరే కాదు, విదేశాల్లో కూడా నెట్‌ కట్‌!

Inter Net Shutdowns Else In The World - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో గత వారం రోజులుగా ల్యాండ్‌ ఫోన్‌ సర్వీసులు సహా మొబైల్‌ ఫోన్, నెట్‌ సర్వీసులను పూర్తిగా నిలిపివేసిన విషయం తెల్సిందే. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కమ్యూనికేషన్ల చట్టం నిబంధనల ప్రకారం అత్యయిక పరిస్థితులు, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని వీటి సేవలను నిలిపివేయవచ్చు. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలో, పలు దేశాల్లో ఇలా కమ్యూనికేషన్‌ సర్వీసులను నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ల్యాండ్‌లైన్‌ ఫోన్ల సర్వీసులను అత్యయిక పరిస్థితుల్లో నిలిపివేసిన దేశాలు చైనా, మయన్మార్, సిరియా, ఇజ్రాయెల్‌ మాత్రమే. ఈసారి కశ్మీర్‌లో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ సర్వీసులను నిలిపివేయడం ద్వారా భారత్‌ కూడా ఆ దేశాల సరసన చేరింది. 

గాజాలో 2011, 2017
పాలస్తీనాలోని గాజా ప్రాంతానికి మిగతా ప్రపంచంతో కమ్యూనికేషన్‌ సంబంధాలను తెంపేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెట్‌ సైన్యం సరిహద్దు వెంబడి కమ్యూనికేషన్‌ కేబుళ్లను బుల్‌డోజర్లతోని తొలగించి వేసింది. మొబైల్, ఇంటర్నెట్‌ సర్వీసులతోపాటు ల్యాండ్‌లైన్‌ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. పాలస్తీనాకు సొంత టెలిఫోన్‌ కంపెనీలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన పరికరాల కోసం ఇజ్రాయెల్‌పైనే ఆధారపడాల్సి ఉంది. అందుకనే 2017లో బ్యాకప్‌ జనరేటర్‌ పేలిపోవడంతో మరోసారి ల్యాండ్‌లైన్‌ సర్వీసులు నిలిచిపోయాయి. ఆంక్షల కారణంగా ఇజ్రాయెల్‌ నుంచి మరో జనరేటర్‌ను పాలస్తీనా కొనుగోలు చేయలేక పోయింది. 

టిబెట్‌లో 2012
టిబెట్‌ ప్రాంతంపై చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా 2012లో టిబెట్‌కు చెందిన బౌద్ధ సన్యాసులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినప్పుడు టిబెట్‌ ప్రాంతంలో టెలిఫోన్‌ సర్వీసులు నిలిచిపోయాయి. 

సిరియాలో 2012
సిరియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు ఇంటర్నెట్, మొబైల్‌ సర్వీసులు నిలిపి వేశారు. ముఖ్యంగా సైనిక దాడులు ప్రారంభం కాకముందు ‘బషర్‌ అల్‌ అసద్‌’ ప్రభుత్వం కమ్యూనికేషన్‌ సర్వీసులను ఎక్కువగా నిలిపి వేసింది. 2015లో ఇంటర్నెట్, మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను ప్రభుత్వమే నిలిపివేసింది. 

మయన్మార్‌లో 2013
బౌద్ధులు, ముస్లింల మధ్యన పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగడంతో మొబైల్, ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేశారు. 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు కూడా విధించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top