బంధాన్ని బలోపేతం చేసుకుందాం: లీ కెఖియాంగ్ | Indian prime minister invites Chinese president to visit | Sakshi
Sakshi News home page

బంధాన్ని బలోపేతం చేసుకుందాం: లీ కెఖియాంగ్

May 30 2014 1:10 AM | Updated on Sep 2 2017 8:02 AM

బంధాన్ని బలోపేతం చేసుకుందాం: లీ కెఖియాంగ్

బంధాన్ని బలోపేతం చేసుకుందాం: లీ కెఖియాంగ్

భారత్-చైనాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాల ప్రధానులు గురువారం అభిలషించారు.

భారత్-చైనా ప్రధానుల అభిలాష
* మోడీకి ఫోన్ చేసిన లీ కెఖియాంగ్

 
బీజింగ్/న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాల ప్రధానులు గురువారం అభిలషించారు. భారత కొత్త ప్రభుత్వంతో పటిష్ట బంధాన్ని కోరుకుంటున్నట్లు చైనా ప్రధాని లీ కెఖియాంగ్ పేర్కొనగా.. ఇరుదేశాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. మోడీతో పాటు కొత్త విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చే నెల 8న తమ విదేశాంగ మంత్రిని భారత్‌కు పంపాలని బుధవారమే చైనా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లీ గురువారం మోడీతో 25 నిమిషాలపాటు ఫోన్‌లో మాట్లాడారు.
 
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీకి ఫోన్ చేసి మాట్లాడిన తొలి విదేశీ నేత ఆయనే కావడం విశేషం. ఈ సందర్భంగా భారత్‌తో దృఢమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు లీ  చెప్పారు. ఇందుకు మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. భారత విదేశాంగ విధానంలో చైనాకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల విస్తృతిని స్వాగతిస్తానని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చైనా నాయకత్వంతో కలిసి పనిచేస్తామని మోడీ వివరించారు.
 
మోడీకి అభినందనలు తెలపడానికి, కొత్త ప్రభుత్వంలోని మంత్రులను కలుసుకోడానికి తమ విదేశాంగ మంత్రి వాంగ్ ఈని భారత్‌కు పంపుతున్నట్లు చైనా అధికారిక సమాచారం ఇచ్చిందని కూడా పేర్కొన్నాయి. భారత్‌లో పర్యటించాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ని ఆ దేశ ప్రధాని ద్వారా మోడీ ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. జూలైలో జరిగే బ్రిక్స్ దేశాల సదస్సులో మోడీ, లీ కలుసుకునే అవకాశముందన్నారు.  
 
సుష్మాకు ఫోన్ల మీద ఫోన్లు: విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుష్మా స్వరాజ్‌కు బుధవారం రాత్రి నుంచే ప్రపంచ దేశాల నుంచి ఫోన్లు వెల్లువెత్తాయి. మొదటగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆమెకు ఫోన్ చేయడం విశేషం. ఇరు దేశాల మధ్య సంబంధాలు, వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చ లు జరిపారు. అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోడానికి భారత్ ప్రాధాన్యమిస్తుందని సుష్మ పేర్కొన్నారు. తర్వా త ఆస్ట్రేలియా, కెనడా, ఇజ్రాయెల్, యూఏఈ, యూకే, దక్షిణాఫ్రికా దేశాల మంత్రులు కూడా సుష్మతో ఫోన్‌లో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement