చైనాకు దీటుగా బలగాల మోహరింపు

Indian Army to retain additional troops in Ladakh - Sakshi

న్యూఢిల్లీ:  తూర్పు లద్దాఖ్‌లోని దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, దెప్సాంగ్‌ ప్రాంతాల్లో చైనా సుమారు 17 వేల సైనికులను, యుద్ధ వాహనాలను మోహరించింది. ఏప్రిల్, మేల నుంచే చైనా ఆ ప్రాంతాలకు బలగాల తరలింపు ప్రారంభించింది. అలాగే, అక్కడ పెట్రోలింగ్‌ పాయింట్‌(పీపీ) 10 నుంచి పీపీ 13 వరకు భారత బలగాల గస్తీ విధులను చైనా సైనికులు అడ్డుకోవడం ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాంతో, భారత్‌ కూడా అదే స్థాయిలో స్పందించిందని, టీ 90 రెజిమెంట్స్‌ సహా భారీగా బలగాలను ఆ ప్రాంతాలకు తరలించిందని వెల్లడించాయి.

 కారకోరం పాస్‌ దగ్గర్లోని పీపీ 1 దగ్గర్నుంచి పెద్ద ఎత్తున భారత్‌ బలగాలను దెప్సాంగ్‌కు తరలించిందని తెలిపాయి. ఏదైనా దుస్సాహసానికి పాల్పడాలంటే చైనా పలుమార్లు ఆలోచించే స్థాయిలో 15 వేల మంది భారత జవాన్లు అక్కడ సిద్ధంగా ఉన్నారన్నాయి. టీడబ్ల్యూడీ బెటాలియన్‌ ప్రధాన కార్యాలయం నుంచి కారకోరం కనుమ వరకు రోడ్డు నిర్మించాలని చైనా భావిస్తోంది.  ఈ రోడ్డు నిర్మాణంతో రెండు బెటాలియన్ల మధ్య దూరం చాలా తగ్గుతుంది.   భారత భూభాగంలోని పీపీ 7, పీపీ 8 మధ్య చైనా గతంలో చిన్న వంతెనను నిర్మించగా భారత సైనికులు దాన్ని కూల్చేశారు.

భౌగోళిక సమగ్రతలో రాజీ లేదు
చైనాకు మరోసారి స్పష్టం చేసిన భారత్‌
దేశ భౌగోళిక సమగ్రత విషయంలో రాజీ లేదని చైనాకు భారత్‌ మరోసారి తేల్చిచెప్పింది. భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సొ, ఇతర ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని ఇరుదేశాల మిలటరీ కమాండర్‌ స్థాయి ఐదో విడత చర్చల సందర్భంగా స్పష్టం చేసింది.

సీనియర్‌ కమాండర్‌ స్థాయి అధికారుల నేతృత్వంలో  ఆదివారం చైనా భూభాగంలోని మోల్డో వద్ద  11 గంటల పాటు చర్చించారు. రెండు దేశాల మధ్య సౌహార్ధ సంబంధాలు నెలకొనాలంటే.. వాస్తవాధీన రేఖ వెంట గతంలో ఉన్న యథాతథ స్థితి నెలకొనడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేసినట్లు  ఆర్మీ వర్గాలు సోమవారం వెల్లడించాయి.  ‘గల్వాన్‌ లోయ, పలు ఇతర ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంది. కానీ పాంగాంగ్‌ సొ ప్రాంతంలోని ఫింగర్‌ 4, ఫింగర్‌ 8 ల్లో, గొగ్రా వద్ద  బలగాలను ఉపసంహరించకపోవడంపై భారత్‌ గట్టిగా ప్రశ్నించింది’ అని వివరించాయి.

1.75 లక్షల కోట్ల టర్నోవర్‌ లక్ష్యం
2025 నాటికి రక్షణ ఉత్పత్తుల టర్నోవర్‌ రూ. 1.75 లక్షల కోట్లకు చేరాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిగా మారే సామర్ధ్యం ఈ రంగానికి ఉందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ‘డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీ–2020’ ముసాయిదాను రక్షణ శాఖ రూపొందించింది. అందులో, రానున్న ఐదేళ్లలో అంతరిక్ష రక్షణ రంగ ఉత్పత్తులు, సేవల ఎగుమతుల లక్ష్యమే రూ. 35 వేల కోట్లని అందులో పేర్కొంది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top