
టెక్నాలజీ యుగంలో యుద్ధరీతి మారిపోయింది
కొత్త సవాళ్లు ఎదుర్కొనేందుకు ఐసీజీ సన్నద్ధం కావాలి
ఐసీజీ కమాండర్ల సదస్సులో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక యుగంలో యుద్ధరీతి పూర్తిగా మారిపోయిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. సంఘర్షణలు జరిగే విధానాన్ని శాటిలైట్లు, డ్రోన్లు, సెన్సార్లు సమూలంగా మార్చేశాయని అన్నారు. నెలల తరబడి యుద్ధాలు కొనసాగే రోజులు ఎప్పుడో పోయాయని తెలిపారు. శత్రుదేశాలతో సాయుధ పోరాటానికి గంటలు, సెకన్లలోనే తెరపడే పరిస్థితి వచ్చిందని స్పష్టంచేశారు. సోమవారం ఢిల్లీలో ఇండియన్ కోస్ట్‌గార్డ్(ఐసీజీ) కమాండర్ల 42వ సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు.
మారుతున్న కాలంలో కొత్తగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించడానికి, విధి నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని ఐసీజీ అధికారులకు సూచించారు. సైబర్, ఎల్రక్టానిక్ యుద్ధరీతి అనేది ఇక ఎంతమాత్రం ఊహాత్మకం కాదని, అది వాస్తవ రూపం దాల్చిందని గుర్తుచేశారు. మన దేశానికి పెనుముప్పుగా మారిన సైబర్, ఎలక్ట్రానిక్ యుద్ధాలను ఎదుర్కోవడానికి ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు.
ఒక దేశం మరో దేశంలోని వ్యవస్థలను నాశనం చేయాలని భావిస్తే శక్తివంతమైన క్షిపణులు ప్రయోగించాల్సిన అవసరం లేదని.. కంప్యూటర్లను హ్యాకింగ్ చేస్తే చాలని అన్నారు. సైబర్ దాడులు, ఎల్రక్టానిక్ జామింగ్‌తో అల్లకల్లోలం సృష్టించవచ్చని తేల్చిచెప్పారు. ఇలాంటి అంతర్జాల దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, శిక్షణను, రక్షణ పరికరాలను ఆధునీకరించాలని ఐసీజీకి సూచించారు. నిఘా వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలన్నారు. సైబర్ దాడులను క్షణాల వ్యవధిలోనే తిప్పికొట్టాలంటే కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
సంప్రదాయ విధానాలు సరిపోవు
అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీ్వప్‌ను కూ డా కలుపుకొంటే భారత్‌కు 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. తీరప్రాంత భద్రత విషయంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వీటిని అరికట్టాలంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, సుశిక్షితులైన సిబ్బంది, పటిష్టమైన నిఘా వ్యవస్థ అత్యవసరమని ఉద్ఘాటించారు. సముద్ర తీర ముప్పు కూడా ఆధునికతను సంతరించుకుందని వివరించారు.
ఓడల్లో అక్రమ రవాణా, సముద్ర దొంగల గురించి గతంలో మాట్లాడుకున్నామని గుర్తుచేశారు. ఇప్పుడంతా జీపీఎస్ స్ఫూపింగ్, రిమోట్‌తో నియంత్రించే పడవలు, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ, డ్రోన్లు, శాటిలైట్ ఫోన్లు, డార్క్‌వెబ్ వంటి వాటితో నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు సైతం ఆధునిక టెక్నాలజీని వాడుకుంటున్నాయని రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పుడు సముద్ర తీర ముప్పును ఎదిరించాలంటే సంప్రదాయ విధానాలు ఎంతమాత్రం సరిపోవన్నారు.