
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో వరుసగా రెండో రోజూ రికార్డుస్ధాయిలో 19,906 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,28,859కు చేరింది. మహమ్మారితో ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశంగా అమెరికా, బ్రెజిల్, రష్యాల తర్వాత భారత్ నాలుగో స్ధానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా మరణాల్లో 87 శాతం ఎనిమిది రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కాగా మధ్యస్ధాయి, తీవ్ర లక్షణాలతో బాధపడే రోగులకు డెక్సామెథాసోన్ ఔషధం వాడేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇక కరోనా హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో వరుసగా రెండో రోజూ 5000కు పైగా కోవిడ్-19 కేసుల సంఖ్య నమోదైంది. తాజా కేసులతో మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,133కు ఎగబాకింది. మహమ్మారితో వణుకుతున్న మైంబై మహానగరంలో 1400 తాజా కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74,252కు పెరిగింది. చదవండి : మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్