దేశమంతటా 21 రోజులు లాక్‌డౌన్‌

India Lockdown For 21 Days Says Prime Minister Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈరోజు రాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు లాక్‌డౌన్‌ తప్పదని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ మూడు వారాలు ఉంటుందని చెప్పారు. ఇది ఒకరకంగా కర్ఫ్యూ వంటిదేనని అన్నారు. రాబోయే 21 రోజులు ఏ ఒక్కరూ ఇంటినుంచి కదలవద్దని వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని చెప్పారు. దేశానికి ఇది పరీక్షా సమయమని, నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రధాని మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సంక్లిష్ట సమయంలో అందరూ సహకరించాలని, సామాజిక దూరం పాటించడమే ఈ మహమ్మారిని నియంత్రించేందుకు పరిష్కారమని అన్నారు. దయచేసి ఈ 21 రోజులూ ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రావద్దని చేతులు జోడించి ప్రార్ధిస్తున్నానని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ లక్ష్మణ రేఖను దాటకూడదని కోరారు. ఎవరికీ ఇబ్బంది రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడతాయని, నిత్యావసరాలను అందుబాటులోకి తీసుకువస్తాయని చెప్పారు. వదంతులు నమ్మవద్దని చెప్పారు.

స్వీయ నిర్బంధమే అడ్డుకట్ట

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని పారదోలేందుకు స్వీయ నిర్బంధం తప్ప మరో మార్గం లేదన్నారు. సమిష్టిగా ఈ వైరస్‌పై పోరాడాలని పిలుపు ఇచ్చారు. ఇళ్లలో ఉంటేనే కరోనా నుంచి బయటపడగలమని అన్నారు. మహమ్మారి వైరస్‌ సైకిల్‌ను మనం అడ్డుకోవాలని అన్నారు. ప్రపంచ పరిణామాలను మనం పరిశీలిస్తున్నామని, అగ్రరాజ్యాలను సైతం ఈ మహమ్మారి అతలాకుతలం చేస్తోందని గుర్తుచేశారు. కరోనా సంక్రమించిందన్న విషయం ముందు ఎవరూ గుర్తించలేరన్నారు.

వ్యాధి లక్షణాలున్న వారే కాకుండా అందరూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. తాను ప్రధానిగా కాకుండా మీ కుటుంబ సభ్యుడిలా చెబుతున్నానని, ఈ మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒక వ్యక్తి నుంచి వేల మందికి వైరస్‌ వ్యాపించవచ్చని అన్నారు.11 రోజుల్లోనే లక్ష నుంచి రెండు లక్షల మందికి ఈ మహమ్మారి సోకిందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించిందని చెప్పారు.

చదవండి : లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top