అమల్లోకి వచ్చిన కాలుష్య ఎమర్జెన్సీ

Huge Pollution In Delhi NCR - Sakshi

సరి–బేసికి సిద్ధమైన ఢిల్లీ ప్రభుత్వం

అదనపు రైళ్లను దింపిన ఢిల్లీ మెట్రో

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ– ఎన్సీఆర్‌లో కాలుష్య సమస్య రోజురోజుకు ముదురుతుండడంతో గురువారం నుంచి కాలుష్య నియంత్రణ కోసం ఎమర్జెన్సీని పది రోజుల పాటు అమల్లోకి తెచ్చారు. నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ కింద కాలుష్య నియంత్రణ కోసం నిర్మాణ పనులపై నిషేధం విధించడం, స్టోన్‌ క్రషర్స్, హాట్‌ మిక్స్‌ ప్లాంట్లను మూసివేయడం వంటి పలు కఠిన చర్యలు అమల్లోకి వచ్చాయి. ఈ నియమాలను ఉల్లంఘించేవారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థలను ఆదేశించారు. కాలుష్య కారక వాహనాలను తనిఖీ చేసే కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ జారీ చేసిన ఆదేశాల మేరకు ఢిలీ ట్రాఫిక్‌ పోలీసులు, రవాణా విభాగం అధికారుల బృందాలు రోడ్లపై పాత వాహనాలను తనిఖీ చేస్తూ స్వాధీనం చేసుకుంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా అవసరమైనప్పుడు సరి–బేసి విధానాన్ని అమలుచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

ప్రైవేటు వాహనాలను పక్కనపెట్టండి...
నగరంలో కాలుష్యం మరింత దిగజారే సూచనలు కనిపిస్తోన్న దృష్ట్యా రానున్న పది రోజుల పాటు ప్రైవేటు వాహనాలను పక్కనపెట్టి ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించవలసిందిగా ఎన్విరాన్‌మెంట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ అథారిటీ(ఈపీసీఏ), ఢిల్లీ–ఎన్సీఆర్‌ వాసులను కోరింది. ఢిల్లీ–ఎన్సీఆర్‌లో కాలుష్యానికి ప్రైవేటు వాహనాలు 40 శాతం కారణమవుతున్నాయని ఈపీసీఏ తెలిపింది. ఢిల్లీలో 35 లక్షల ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. ఢిల్లీ మెట్రో కూడా బుధవారం నుంచి 21 అదనపు రైళ్లను పట్టాలపై దింపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top