హే రాం.. ఇదేం అవమానం

Hindu Mahasabha Leader Shoots MahatmaGandhi Effigy - Sakshi

అలీగఢ్‌‌: వర్థంతి రోజునే జాతిపితకు ఘోర అవమానం జరిగింది. 71వ వర్థంతి సందర్భంగా జాతి యావత్తు మహాత్ముడికి నివాళులు అర్పిస్తున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో హిందూ మహాసభ సంస్థ గాంధీని అమానించింది. మహాత్మ గాంధీ హత్యోదంతాన్ని ప్రదర్శించి హిందూ మహాసభ కార్యకర్తలు తమ పైత్యం చూపించారు. అక్కడితో ఆగకుండా హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజ శకున్‌ పాండే.. మహాత్ముడి దిష్టిబొమ్మను కృత్రిమ తుపాకీతో పదే పదే కాలుస్తూ పైశాచిక ఆనందం పొందారు. తుపాకీ పేల్చగానే దిష్టిబొమ్మ నుంచి రక్తం వస్తున్నట్టుగా చూపించారు. తర్వాత ఆమె అనుచరులు కూడా ఇదేవిధంగా చేశారు.

అనంతరం నాథురాం గాడ్సే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాథురాం గాడ్సేకి అనుకూలంగా నినాదాలు చేశారు. పరస్పరం స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ ఉదంతంపై గాంధేయ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతిపితను అవమానించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం గాంధీ వర్థంతిని హిందూ మహాసభ శౌర్య దివస్‌ లేదా అమరుల దినంగా జరుపుతోంది. పూజ శకున్‌ పాండేకు నిజమైన హిందూ మహాసభకు సంబంధం లేదని తెలుస్తోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top