అక్కడ ఖాతా తెరవని బీజేపీ.. అందుకే బరిలో బబితా

Haryana Elections Geeta Phogat Confidence On Sisters Babita Phogat Winning - Sakshi

చంఢీగర్‌ : హరియాణలోని దాద్రి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న తన చెల్లెలు బబితా ఫోగాట్‌ (29) విజయం తథ్యమని ఆమె సోదరి గీతా ఫోగాట్‌ ధీమా వ్యక్తం చేశారు. రెజ్లింగ్‌లో మాదిరిగానే రాజకీయాల్లోను బబితా సత్తా చాటుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, జాట్ల ప్రాబల్యం ఉన్న దాద్రి నియోజకవర్గకంలో బీజేపీ ఇప్పటి వరకు ఖాతా తెరవకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో ఈస్థానం నుంచి రాజ్‌దీప్‌ ఫోగాట్‌ (ఐఎన్‌ఎల్డీ) విజయం సాధించారు. అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండటంతో బీజేపీ బబితాను బరిలో నిలిపింది. 

మోదీ ర్యాలీ కలిసొస్తుందా..
బబితతో పాటు దాద్రి స్థానానికి జేజేపీ నుంచి సత్పాల్‌ సంగ్వాన్‌, కాంగ్రెస్‌ నుంచి మేజర్‌ నిర్పేందర్‌ సంగ్వాన్‌, స్వతంత్ర అభ్యర్థిగా సోమ్‌వీర్‌ సంగ్వాన్‌ పోటీలో ఉన్నారు. ఇక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన బబితా ఎంతమేరకు ప్రత్యర్థులను ఢీకొడుతుందో చూడాలి. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించడం బీజేపీకి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

‘నా చెల్లెల్ని ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. బబితా దేశానికి చేసిన సేవల పట్ల అందరికీ గౌరవం ఉంది. ఆమె రాజకీయాల్లో కూడా రాణిస్తుంది. అయితే, గెలుపోటములు ఎక్కడైనా సహజం. మేము క్రీడాకారులం. చమత్కారమైన లేక జాలి, సానుభూతితో కూడిన రాజకీయాలు చేతకావు’ అని గీతా చెప్పుకొచ్చారు. ఇక ఈ ఇద్దరు రెజ్లర్‌ సోదరీమణుల ఇతివృత్తంగా తెరకెక్కి దంగల్‌ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top