తగ్గిన శిశుమరణాల రేటు

తగ్గిన శిశుమరణాల రేటు - Sakshi


57 నుంచి 41 శాతానికి దిగివచ్చిన ఐఎంఆర్‌

•  దేశంలో మెరుగైన లింగనిష్పత్తి

•  జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి




న్యూఢిల్లీ: గత పదేళ్లలో శిశుమరణాల రేటు(ఐఎంఆర్‌) దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గిందని సర్వేలో తేలింది. 2005–06లో ప్రతి వేయి మంది శిశువులకు 57 మంది చనిపోతుండగా 2015–16నాటికి ఆ రేటు 41కి పడిపోయింది. త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్,  అరుణాచల్‌ప్రదేశ్, రాజస్తాన్ , ఒడిశాల్లో ఐఎంఆర్‌ సుమారు 20 శాతానికి పైగా తగ్గింది. మంగళవారం విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ ఎఫ్‌హెచ్‌ఎస్‌–4) ప్రకారం...జనన సమయంలో లింగ నిష్పత్తి(ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) జాతీయ స్థాయిలో 914 నుంచి 919కి పెరిగింది.


ఈ జాబితాలో కేరళ(1047), మేఘాలయ(1009), ఛత్తీస్‌గఢ్‌(977) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 38.7 శాతం నుంచి 78.9 శాతానికి పెరిగింది.  తక్కువ బరువున్న పిల్లల శాతం 7 శాతం తగ్గిందని తెలిపింది. 6–59  నెలల మధ్యనున్న పిల్లల్లో అనీమి యా 69 శాతం నుంచి 59 శాతానికి దిగివచ్చినట్లు సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా 6 లక్షల గృహాలు, 7 లక్షల మహిళలు, 1.3 లక్షల పురుషుల నుంచి సమాచారం సేకరించి ఈ సర్వే జరిపారు. ఈసారి జిల్లాలవారీగా  కూడా గణాంకాలు తయారు చేశారు.



అనవసర సిజేరియన్ లు వద్దు

అనవసర సిజేరియన్  చికిత్సలను కట్టడిచేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను కోరింది. ప్రైవేట్‌ రంగంలో ఇవి ఒక్కసారిగా పెరిగాయని సర్వే సూచించిన నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 2005–06లో(ఎన్ ఎఫ్‌హెచ్‌ఎస్‌–3) 8.5 శాతంగా ఉన్న జాతీయ సగటు సిజేరియన్ శస్త్రచికిత్సలు 2015–16 నాటికి 17.2 శాతానికి పెరిగాయి.


ప్రైవేట్‌ రంగంలో ఇవి 2005–06లో 27.7 శాతంగా ఉండగా 2015–16 నాటికి 40 శాతానికి చేరాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్  చికిత్సలు 2015–16 కాలానికి  15.2 శాతం నుంచి 11.9 శాతానికి పడిపోయాయి.  అవసరమైనప్పుడే సిజేరియన్  ఆపరేషన్లు చేసేలా ప్రైవేటు ఆసుపత్రులను ఒప్పించాలని రాష్ట్రాలను కోరుతున్నట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా విలేకర్లతో చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top