
భార్యాభర్తల మధ్య వయసు అంతరంతో సమస్యలు
ఛాలెంజ్‌గా మారే పిల్లల ఆలనాపాలనా, పెంపకమూ
రిటైరైపోయినా.. ఇంకా స్థిరపడని పిల్లలతో టెన్షన్
‘నాకు పిల్లలు కావాలని అనిపిస్తోంది. దత్తత తీసుకునే ఆలోచన లేదు. కచ్చితంగా ఒక బిడ్డ అయితే ఉంటుంది. అది ఎప్పుడైనా జరగొచ్చు. నాకు పిల్లలు పుడితే వారి ఆలనాపాలనా చూసుకునేందుకు నా కుటుంబం ఉంది’ అని 59 ఏళ్ల బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సరే, పిల్లలు ఎప్పుడు పుట్టినా సల్మాన్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ, సామాన్యుల విషయంలో అలా కాదు. పిల్లలు తప్పనిసరిగా కావాలనుకున్నవాళ్లకి మాత్రం.. ఒక వయసు దాటాక పిల్లలు పుడితే వాళ్ల పెంపకం, భవిష్యత్తు పెద్ద సమస్యగా మారతాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు అంటుంటారు. చదవాల్సిన వయసులో చదవకపోతే.. ఉద్యోగం రావాల్సిన వయసులో రాదు. ఉద్యోగం రానంతవరకు.. జరగాల్సిన వయసులో ఆ మూడు ముళ్ల తంతు కూడా కాదు. పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టేస్తారన్న గ్యారంటీ ఈ రోజుల్లో లేదు.
ఒకప్పుడు అలా..: ఓ రెండు దశాబ్దాల కిందటి వరకూ.. అబ్బాయిలకు 25–26 ఏళ్లు వచ్చేటప్పటికి.. పెళ్లిళ్లు అయిపోయేవి. 30 ఏళ్లలోపు.. పిల్లలు పుట్టేసేవారు. పిల్లల కోసం, తమకోసం ఆర్థిక ప్రణాళికలు కూడా వేసుకునే అవకాశం ఉండేది.
50 ఏళ్లలోపే.. పుట్టిన పిల్లలకు ఉద్యోగాలు రావడం, పెళ్లిళ్లు కూడా అయిపోయేవి. అక్కడి నుంచి ఒక రకంగా ఫ్రీబర్డ్‌లా ఉండేవారు. రిటైర్మెంట్ కూడా సాఫీగా జరిగిపోయేది. కానీ, అదే పెళ్లి ఏ 30 ఏళ్లకో, 35 ఏళ్లకో జరిగితే ఏంటి పరిస్థితి?
పిల్లలు పుడతారో పుట్టరో!
సాధారణంగా మహిళల్లో 30 ఏళ్లు దాటాక.. పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతుంటాయి. ప్రస్తుత జీవనశైలి సమస్యలు, ఒత్తిడి, పర్యావరణ కాలుష్యం ఇవన్నీ.. అగ్నికి ఆజ్యం పోసినట్టు పిల్లలు పుట్టే అవకాశాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అందువల్ల మూడు పదుల దాటాక మూడుముళ్లు వేస్తే.. వాళ్ల మధ్యలోకి ముచ్చటగా మూడోవ్యక్తి రావడం అంత సులభం కాదు. ఒకవేళ పుట్టినా.. తరవాత అనేక సమస్యలు సిద్ధంగా ఉంటాయి.
పిల్లల పెంపకం
30–35 ఏళ్ల తరవాత పిల్లలు పుడితే.. 45 దాటిన తరవాత నుంచీ వాళ్ల చదువు కోసం టెన్షన్ మొదలవుతుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉండేవాళ్లు పిల్లలను చూసుకోవడం కాస్త ఇబ్బందవుతుంది. ఇద్దరూ ఉద్యోగులైతే.. ఇక చెప్పనక్కర్లేదు. 25–30లలో ఉండే ఓపిక, సహనం.. 40లలో ఉండవు. ప్రతి చిన్న విషయానికీ చిర్రుబుర్రులాడుతుంటే ఆ చిన్నారుల మనసుల మీద ప్రభావం పడుతుంది.
ఆలోచనల్లో అంతరాలు
లేటు వయసులో పుట్టే పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఆలోచనల్లో చాలా అంతరం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల స్పీడును వీళ్లు అందుకోలేరు.
శారీరక, మానసిక ఆరోగ్యం
35 దాటాక.. అనేక శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఒకవైపు వీటితో సతమతమవుతూనే పిల్లల పెంపకమూ చూడటం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఏషియన్ జర్నల్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషనల్‌లో ఇటీవల ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. 35 ఏళ్ల వరకు పెళ్లికాని వాళ్లలో హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందట. సినిమాల్లో వ్యంగ్యంగా చెప్పినట్టు.. పెళ్లయ్యాక ఇవి రావడం కాదు, వీటితోనే పెళ్లి మండపం మీదకు అడుగుపెట్టాల్సి రావచ్చన్నమాట.
వాళ్ల సెటిల్మెంట్.. మీ రిటైర్మెంట్
పిల్లలు ఒక ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిర పడేసరికి తండ్రి వయసు 55 దాటిపోతుంది. దాదాపు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేస్తారు లేదా రిటైరయ్యాక వాళ్లు స్థిరపడవచ్చు. మీరు రిటైరైపోయిన తరవాత కూడా పిల్లలు సెటిల్ కాకపోతే అదో పెద్ద సమస్య. శారీరక, మానసిక ఆరోగ్యాలు సహకరించకపోయినా అయిష్టంగా, అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తుంది. ఈ మధ్యలో ‘మీవాడు ఇంకా సెటిల్ కాలేదా?’ అంటూ బంధుమిత్రుల విచారణలు మరింత చికాకు తెప్పిస్తాయి.
వైవాహిక జీవితంలోనూ..
ఆలస్యంగా పెళ్లి చేసుకునే సందర్భంలో.. భార్యాభర్తల మధ్య వయసు అంతరం ఎక్కువ ఉంటే భాగస్వామి మనసును అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వారి ఆశలు, ఆకాంక్షలు ఒకలా ఉంటాయి.. వీరి ఆలోచనలూ, నిర్ణయాలూ మరోలా ఉంటాయి. ఇది దీర్ఘకాలంలో ఇద్దరి మధ్యా అగాథాన్ని పెద్దది చేస్తుంది. కలసి ఉంటున్నా భాగస్వామిలో అశాంతి రాజ్యమేలుతుంటుంది.
ఆర్థిక సమస్యలు
పిల్లల భవిష్యత్తు, సొంతిల్లు కొనుగోలు.. ఇలాంటి ప్రణాళికలపైనా ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఖర్చులు పెరిగిపోతుంటాయి. భవిష్యత్ ప్రణాళికల వ్యయమూ తడిసిమోపెడవుతుంది. ఆ సంపాదన కోసం అదనంగా కష్టపడాల్సి వస్తుంది.
పెళ్లికాని ప్రసాదులు 39 శాతం
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019–2021) ప్రకారం.. మనదేశంలో 45–49 ఏళ్లున్న స్త్రీలలో ఒక శాతం.. పురుషుల్లో 3 శాతం పెళ్లికాకుండా ఉన్నారు.15–49 ఏళ్ల పురుషుల్లో పెళ్లయిన వారు 60 శాతం మందే. మహిళల విషయంలో ఇది 72 శాతం. మహిళల్లో పెళ్లికాని వారు 24 శాతం కాగా.. పురుషుల్లో ఇది 39 శాతం.