
దైనందిన జీవితంలో భాగమైపోయిన రీల్స్
రీల్స్ తీస్తూ ‘రేఖ’ దాటేస్తున్న వైనం
అసభ్యకరమైన కంటెంట్‌తో వీడియోలు
కుటుంబాలలో గొడవలు, ఘర్షణలు
రీల్స్ చేస్తున్నవాళ్లు, రీల్స్ చూస్తున్నవాళ్లు.. సమాజంలో ఉన్నది ఇప్పుడు ఈ రెండే వర్గాలు అన్నంతగా సోషల్ మీడియా మార్చేసింది. ఉన్నవారు–లేనివారు.. స్త్రీలు–పురుషులు.. రాత్రి–పగలు.. ఇంట–బయట.. ఇవేవీలేవు, ప్రతి ఒక్కరూ రీల్స్‌కి అతుక్కుపోతున్నారు. వాళ్లు అలా అతుక్కుపోయేలా కంటెంట్ క్రియేటర్‌లు రీల్స్ చేసి సోషల్ మీడియాలోకి వదిలిపెడుతున్నారు. అయితే ఎంతోమందికి ఆనందాన్నిస్తున్న రీల్సే.. ఆ రీల్స్ చేస్తున్న వ్యక్తులు ముఖ్యంగా మహిళల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. పరువు కోసం కుటుంబ సభ్యులే వారి ఉసురు తీసేందుకు ప్రేరేపిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
నిక్కీ భాటీ.. గ్రేటర్ నోయిడాకు చెందిన 26 ఏళ్ల ఈమెను ఇటీవల ఆమె భర్త, అత్తమామలు చిత్రహింసలు పెట్టి నిప్పంటించటంతో మరణించింది. మొదట దీన్ని వరకట్న హత్య అని పోలీసులు భావించారు. అయితే నిక్కీ రీల్స్ చేయటంపై అభ్యంతరం తెలిపిన ఆమె మెట్టినింటివారు.. ఆమె తమ మాట వినకపోవటంతో ఆమెపై తీవ్రంగా దాడి చేసి, నిప్పంటించారని తర్వాత వెల్లడించారు!
వద్దని చెప్పినందుకు..
నిక్కీ మరణానికి కొన్ని నెలల ముందు ఇలాంటి ఘటనే హరియాణాని గురుగావ్‌లో జరిగింది. 25 ఏళ్ల రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక సోషల్ మీడియా రీల్స్ చేయడంపై ఆయన తీవ్రంగా కలత చెందారని, ఆ మనోవ్యథ ఆగ్రహంగా మారి కూతుర్ని చంపేశాడని వార్తలు వచ్చాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక మహిళ తను రీల్స్ చేయటానికి అడ్డు చెప్పినందుకు భర్తపై కత్తితో దాడి చేసింది. ఆ రీల్స్ రెచ్చగొట్టేలా ఉంటున్నాయని ఆ భర్త మనో వేదన.
దేశమంతా ఇదే గొడవ
దేశంలోని చాలాచోట్ల కొందరు చేస్తున్న రీల్స్, షార్ట్స్ కుటుంబాలలో అశాంతికి, ఆవేదనకు, ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. లైక్‌లు, కామెంట్లు, వాటి ద్వారా వచ్చే పేరు, డబ్బు కోసం కొందరు అశ్లీలత, అసభ్యత నిండిన కంటెంట్‌తో వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఎలా ఉన్నా, భారతీయ సమాజం మాత్రం ఈ రీళ్ల సుడిగాలిని తట్టుకోలేక సతమతం అవుతోంది.
పల్లెల నుంచి మహా నగరాలకు వలస వచ్చిన వారు అక్కడి వెలుగు జిలుగుల నవ నాగరికతలకు ఎలాగైతే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతారో.. కంటెంట్ క్రియేటర్‌ల జీవితాల్లోకి రీల్స్, షార్ట్స్ అంతటి థ్రిల్ తెచ్చిపెట్టాయి. వీక్షకులు చూస్తున్నకొద్దీ వారు ఇంకా ఇంకా చూసేలా కంటెంట్ మోతాదును పెంచుకుంటూ పోతున్నారు.
‘మిస్టేకెన్ మోడర్నిటీ’?!
తాత్కాలికమైన ఆనందంతో చురుకు పుట్టించే ‘డోపమైన్–బూస్టింగ్’ కంటెంట్‌ను ఆస్వాదించటంలో వీక్షకులు, అలాంటి కంటెంట్‌ను సృష్టించటంలో కంటెంట్ క్రియేటర్‌లు.. అదే లోకంగా ఉండటంతో సమాజంలో ప్రమాదకరమైన ఘర్షణలకు ఆజ్యం పోసినట్లవుతోంది! కంటెంట్ క్రియేటర్‌లలో కనిపించే ఈ దూకుడును ‘మిస్టేకెన్ మోడర్నిటీ’ (ఆధునికతను వేరేలా అర్థం చేసుకోవటం) అని సామాజిక నిపుణులు అంటున్నారు
ఉపయోగపడేవీ ఉన్నాయి
రీల్స్, షార్ట్స్.. అసభ్యత లేనంతవరకూ ఎవరికీ ఇబ్బంది కావు. అశ్లీలత కానంతవరకూ ఎవరికీ హాని చేయవు. ఒక వర్గాన్ని, మతాన్ని, ఒకరి శరీరాన్ని, వైకల్యాన్ని వెక్కిరిస్తూ, వెకిలిచేష్టలతో చేసే వీడియోలు సమాజానికి ప్రమాదకరం. యువతను పెడదారిపట్టించే కంటెంట్ ఉన్న షార్ట్స్.. ఏ జనరేషన్‌కీ మంచివికావు. మరి, ఉపయోగపడే రీల్స్, షార్ట్స్ లేవా అంటే ఎందుకు లేవూ, చాలా ఉన్నాయి. సరదాగా, నవ్వించేవి.. విజ్ఞానాన్ని పంచేవి.. సరికొత్త విషయాలు తెలియజేసేవి.. వంటలవీ, ఆధ్యాత్మికతవీ.. ఇలాంటి ఎన్నో సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.
వీక్షకులే తిరస్కరించాలి
లైకుల కోసం, ఆర్థిక ప్రయోజనం కోసం కంటెంట్ క్రియేటర్‌లు అశ్లీలమైన, అసభ్యకరమైన రీల్స్‌కి అడ్డుకట్ట వేసేదెలా? చాలా సింపుల్ అంటున్నారు మానసిక నిపుణులు. ‘అలాంటి కంటెంట్‌ను ఆదరించకపోవటం లేదా వారిని బ్లాక్ చేయడం ద్వారా వారికి అడ్డుకట్ట వేయవచ్చు. ఇలాంటి వీడియోలు చేయడం ఒక మానసిక సమస్య కూడా కావచ్చు’ అంటున్నారు మానసిక నిపుణులు.
రీల్సే లోకం!
» ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’, గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘ఇప్సోస్’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 33 పట్టణాల్లో ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
» షార్ట్స్, రీల్స్ భారతీయుల దైనందిన జీవితంలో భాగమైపోయాయి.
» ముఖ్యంగా దేశంలో అత్యధికులు చూసే షార్ట్ ఫామ్ వీడియో ఫార్మాట్‌గా రీల్స్ అవతరించాయి.
» 97 శాతం మంది రోజులో కనీసం ఒక్కసారైనా తక్కువ నిడివిగల వీడియోలు చూస్తున్నారు. ఇందులో సింహభాగం రీల్సే.
» ఈ ట్రెండ్ జెన్ జెడ్ యూజర్లలో ఎక్కువగా ఉంది.వీటిని చూడటం ఎంటర్‌టైన్‌మెంట్ స్థాయిని దాటి.. దైనందిన కార్యకలాపంలా మారిపోయింది.