
మొగుడు అయిన వెంటనే మనిషి అనే హోదాను కోల్పోతారా? భర్త అనే కిరీటం దక్కిన వెంటనే మానవత్వం అనే లక్షణం నశించి పోతుందా? భార్య అనే ప్రాణి మన జీవితంలోకి ప్రవేశిస్తే చాలు, కట్టు బానిసలాగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండవచ్చునా? అనే రకరకాల సందేహాలు రేకెత్తే సందర్భం ఇది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) వారు సేకరించిన డేటా ప్రకారం విస్తుగొలిపే గణాంకాలు బయటకు వస్తున్నాయి.
‘భార్యను భర్త కొట్టడం’ అనేది నేరంగా ఎంచడానికి అవకాశం లేదు- అని ఈ దేశంలోని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వీరిలో పురుషులు, స్త్రీలు కూడా తగు మాత్రం ఉండడం ఇంకా బాధాకరమైన వాస్తవం. వయస్సు, లింగ భేదం ప్రకారం చూసినప్పుడు 40 నుంచి 49 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న వారిలో- భార్యను భర్త కొట్టడం అనేదానిని సాధారణమైన విషయంగా ఎక్కువ మంది ఆమోదిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ వయో తరగతిలో ఇంచుమించుగా 49 శాతం మంది మహిళలు 47 శాతం మంది పురుషులు భార్యను భౌతికంగా కొట్టి హింసించడాన్ని ఆమోదిస్తున్నారు. అనుమతి అడగకుండా భార్య బయటకు వెళ్లడం, పిల్లలను నిర్లక్ష్యం చేయడం లేదా శృంగారానికి నిరాకరించడం వంటి కారణాల మీద భార్యను కొడితే తప్పు లేదంటున్నారు. ఈ పోకడమీద ప్రజల్లో, ప్రధానంగా మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి స్వచ్ఛందసంస్థలు ఒకవైపు పనిచేస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా ‘గౌరవం అనేది ఇంట్లోనే ప్రారంభం కావాలి’ అనే నినాదంతో మహిళలను భర్తే కొట్టడం అనే దుర్మార్గానికి వ్యతిరేకంగా చైతన్యం, అవగాహన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నది.
ఇవన్నీ పక్కన పెడదాం. అసలు భార్యను భర్త కొట్టడం అనే వరకు పరిస్థితులు ఎందుకు వస్తాయి? మనతో కలిసి బతుకుతున్న ఒక ప్రాణిని, మనకంటె తక్కువగా చూడడం, మనకు కోపం వస్తే చేయిచేసుకోవచ్చు అనుకోవడమే చాలా దుర్మార్గమైన సంగతి. కుటుంబ బంధాలు ఆధునిక సమాజంలో ఎంతగా పతనం అయిపోతున్నాయో గమనించినప్పుడు.
ఇంకా దుఃఖం కలుగుతుంది. భార్యల్ని అత్యంత దారుణంగా హత్యచేసి ముక్కలను వేర్వేరు చోట్ల పారవేస్తున్న భర్తలు, భర్తల్ని దారుణంగా చంపేసి.. తప్పించుకోగలం అనుకునే భార్యలు ప్రతిరోజూ మనకు వార్తల్లోనే కనిపిస్తూ ఉన్నారు. కానీ ఒక రకంగా గమనించినప్పుడు.. ఇలా ఒకరినొకరు చంపుకునే భార్యాభర్తల వ్యవహారాల కంటె.. వార్తల్లో కనిపించకుండా.. ఇలాంటి నివేదికల్లో మాత్రమే బయటపడే వ్యవహారాలు చాలా ప్రమాదకరమైనవి.
ఎవరి మీదనైనా సరే మనకు కోపం రావడం అేది మన చేతగానితనం వల్ల జరుగుతుంది. ఫరెగ్జాంపుల్ వంట చేసుకోవడం చేతకాని వారికి.. సమయానికి భార్య వండిపెట్టలేదని కోపం వస్తుంది. ఆ కోపం భార్యమీద చేయి చేసుకోవడం వరకు ఎలా వెళ్లగలుగుతుందంటే.. ఆమె తిరిగి తనను కొట్టదనే భరోసా వల్ల! ఈ భరోసా ఎలా వస్తుంది? భార్యల్ని మనం పరాధీనలుగా ఉంచడం వల్ల, ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వాతంత్ర్యం లేని స్థితిలో ఉంచడం వల్ల, ‘నీకు నేనున్నాను’ అనే ఆమెను స్వంతంగా పనులు చేసుకోనివ్వని దుర్బల స్థితిలో పంజరంలో ఉంచేయడం వల్ల! భార్య కూడా ఉద్యోగం చేస్తున్న కుటుంబాల్లో గమనించండి
చికాకులు తగాదాలు సాధారణంగా కనిపించొచ్చు గానీ.. కొట్టడం వరకు వ్యవహారం వెళ్లడం అరుదే. ఎందుకంటే ఆమెకున్న ఆర్థిక స్వేచ్ఛ తీవ్ర నిర్ణయాలకు దారితీస్తుందనే భయం ఆ భర్తను నిలువరిస్తుంది. మారుతున్న సమాజంలో కొట్టడం కొంత తగ్గవచ్చు. దాని గురించి చర్చ కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే.. 41-49 ఏళ్ల వయసు మధ్య గ్రూపులోనే ఈ కొట్టడం పట్ల ఆమోదం ఎక్కువగా ఉన్నది.
కానీ.. ఇక్కడ ప్రమాదకరమైన మరో అంశాన్ని ఈ నివేదికలో గమనించాలి. ఈ వయోతరగతి కాకుండా, అంతకంటె చిన్న వయసు ఉన్న వారిలో ఈ స్థాయిలో ఆమోదం లేకపోవడం గురించి కొంత సంతోషించాలి. కానీ, ఈ వయసు వారిలో ఏకంగా 49 శాతం మంది మహిళలు (పురుషుల శాతం కంటె ఎక్కువగా) భార్యను కొట్టడాన్ని ఆమోదిస్తుండడాన్ని గర్హించాలి. బాధాకరం ఏంటంటే.. ఈ వయసులోని మహిళలు, రేపటి తరం ఇల్లాళ్లను తయారుచేసే వయో తరగతిలో ఉన్నారు. కాబట్టి వీరి ఆలోచనలు మారాలి. మార్చడానికి బయటినుంచి వచ్చిన వారు కాదు.. ఆ పోకడను గుర్తించిన బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు కూడా ప్రయత్నించాలి.
భార్యాభర్తలు ఒకరికోసం ఒకరు జీవించే జోడీ అనే స్పృహ ఇద్దరికీ ఉండాలి. అంతే తప్ప.. ఒకరి వలన ఒకరు, ఒకరి ఆధీనంలో మరొకరు, ఒకరి దయతో మరొకరు జీవింతే జోడీ కాదు అని కూడా గ్రహిపంచాలి. అప్పుడు మొగుడు అయినా సరే.. మనిషే అనే తత్వం వారిలో నాటుకుంటుంది. మానవత్వపు జాడ మిగిలే ఉంటుంది. కుటుంబ వాతావరణంలో ఆశాజనకమైన మంచి వాతావరణం ఏర్పడుతుంది.
-ఎం. రాజేశ్వరి