పెళ్లి అనేది తప్పనిసరి కాదు.. కానీ అవసరం : గవర్నర్‌

Goa Governor Says Don't Call Off Marriages Over Trivial Issues - Sakshi

పనాజి : పవిత్రమైన వివాహ బంధాన్ని కలకాలం కాపాడుకోవాలంటూ గోవా గవర్నర్‌ మృదులా సిన్హా విద్యార్థులకు సూచించారు. గోవా యూనివర్సిటీ 30వ స్నాతకోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆమె విద్యార్థులతో ఐదు ప్రమాణాలు చేయించారు. మహిళా సాధికారతకు కృషి చేయడం, డ్రగ్స్‌కు దూరంగా ఉండటం, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించాలనే ఆలోచన దరి చేరకుండా చూసుకోవడం, చిన్న చిన్న గొడవలకే వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకూదనే భావన పెంపొందించుకోవడం వంటి విషయాల పట్ల యువత శ్రద్ధ కలిగి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

స్నాతకోత్సవంలో భాగంగా సర్టిఫికెట్లు అందుకునేందుకు హాజరైన 9 వేల మంది విద్యార్థులను ఉద్దేశించి మృదులా సిన్హా ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి, ప్రీ మారిటల్‌ కౌన్సిలింగ్‌ ఆవశ్యకతను వివరించారు. ‘ పెళ్లి అనేది తప్పనిసరి కాదు.. కానీ అవసరం. ఒక్కసారి వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత.. ఆ బంధాన్ని కాపాడుకునేందుకు కృషి చేయాలి. భార్యభర్తలు పరస్పర అవగాహన కలిగి ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగేందుకు అవకాశం ఉంటుందంటూ’  ఆమె వ్యాఖ్యానించారు. మహిళలను కించపరిచే సంఘటనలు జరిగినపుడు, వారు ప్రమాదంలో ఉన్నపుడు ప్రాణాలకు తెగించైనా సరే వారిని కాపాడాలంటూ పిలుపునిచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top