ప్రజల వద్దకే మలేరియా డిటెక్షన్ యూనిట్!

ప్రజల వద్దకే మలేరియా డిటెక్షన్ యూనిట్!


మలేరియాను నిర్మూలించడంలో మంగళూరు అధికారులు మరో అడుగు ముందుకేశారు. కర్నాటక ప్రాంతంలో గుర్తించిన మొత్తం 7800 మలేరియా  కేసుల్లో మంగుళూరులోనే 4000 వరకూ ఉండటంతో  అప్రమత్తమయ్యారు. ప్రజా వైద్య సౌకర్యాలను మెరుగు పరిచే దిశగా మొబైల్ మలేరియా డిటెక్షన్ యూనిట్ ను ప్రారంభించారు.  



కర్నాటక మంగుళూరు నగరంలో మలేరియా నివారణ, నియంత్రణ దిశగా చర్యలు ప్రారంభించారు. కర్నాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మొదటిసారి మొబైల్ మలేరియా గుర్తింపు యూనిట్ ను ప్రారంభించింది. ఆరుగురు నిపుణుల బృదంతోపాటు, విశ్లేషణా పరికరాలు, మందులతో కూడిన వాహనాన్ని అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్న మంగళూరు నగరంలో మార్చి 19న ప్రారంభించింది. ఇందులో భాగంగా వైద్య కార్మికులు ఉచిత పరీక్ష, చికిత్స అందించడంతో పాటు... విశ్లేషణా కిట్ సహాయంతో నిమిషాల్లో ఫలితాలను అందిస్తారు. ముందుగా రక్త నమూనాలను సేకరించి కిట్ ద్వారా పరిశీలిస్తారు.  ఫలితం ప్రతికూలంగా చూపితే.. రక్త నమూనాలను మరింత విశ్లేషణ జరిపేందుకు మలేరియా టెస్టింగ్ సెంటర్ కు పంపిస్తారు. ఫలితాలు సానుకూలంగా చూపితే రోగులకు వెంటనే మందులను అందిస్తారు. రక్త పరీక్షలతోపాటు, మందులుకూడ ఉచితంగానే ఇస్తారు.  



ప్రజలు ఒక్క ఫోన్ కాల్ చేసి, అడ్రస్ ఇస్తే చాలు అరగంటలోపు మొబైల్ యూనిట్ వారింటిముందుండేట్టుగా ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. ఈ సౌకర్యం వినియోగించుకొనేందుకు ఓ హాట్ లైన్ నెంబర్ (9448556872) ను ప్రవేశ పెట్టారు. మలేరియా పరీక్షలు నిర్వహించిన ప్రతి వ్యక్తి వివరాలను ఈ మొబైల్ యూనిట్ రిజిస్టర్ చేస్తుంది. మలేరియా వ్యాప్తి నిరోధించడంలో భాగంగా ఆ వివరాలను మంగళూరు సిటీ కార్పొరేషన్ కు అప్పగిస్తుంది. గతేడాది అక్టోబర్ లో స్థాపించిన మలేరియా కంట్రోల్ సాఫ్ట్ వేర్ సిస్టమ్ ద్వారా ఆ వివరాలను అప్ లోడ్ చేస్తారు. నగరంలోని మలేరియా కేసుల వివరాలను తెలిపేందుకు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ మ్యాపింగ్ టూల్ గా ఉపయోగపడుతుంది. నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి చికిత్సా కేంద్రానికి అనుబంధంగా ఈ మొబైల్ యూనిట్.. సేవలు అందిస్తుందని జిల్లా డిసీజ్ కంట్రోల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ ఎస్ బి. తెలిపారు.


Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top