ఒక్కసారిగా కుప్పకూలిన నేర సామ్రాజ్యం!

UP Gangster Vikas Dubey Encounter Some Interesting Details - Sakshi

న్యూఢిల్లీ: ‘నేను వికాస్‌ దూబే.. కాన్పూర్‌ వాలా’అంటూ గట్టిగా అరిచి మధ్యప్రదేశ్‌లోనూ తన ఉనికిని చాటుకోవాలనుకున్న ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌ కథ నేటితో ముగిసింది. అక్రమ సంపాదన, ‘పెద్దల’ అండతో అతడు నిర్మించుకున్న నేర సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఎంతో మంది అమాయక ప్రజలు సహా ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలను బలితీసుకున్న అతడు ఎట్టకేలకు శుక్రవారం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వికాస్‌ దూబే మృతి పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు సహా పోలీసుల పాలిట శుభవార్తగా పరిణమించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (వికాస్‌ దూబే మృతి : విచారణకు మాయావతి డిమాండ్‌)

మరోవైపు.. చాలా మంది నేర చరిత్ర గల ‘నాయకుల’ మాదిరిగానే దూబే కూడా తనను తాను రక్షించుకోవడానికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నాడని... అందుకు రంగం కూడా సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో ఈ మేరకు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాన్పూర్‌ రూరల్‌ జిల్లా బిక్రూ నివాసి అయిన వికాస్‌ దూబే 1990లో తన తండ్రితో గొడవ పెట్టుకున్న వాళ్లపై దాడి చేసి తొలిసారి అరెస్టయ్యాడు. అయితే అప్పటికే అనుచర వర్గాన్ని తయారు చేసుకున్న దూబేకు స్థానిక నాయకుల అండ దొరకడంతో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కాకుండానే ఆ కేసు నుంచి బయటపడ్డాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు బిక్రూతో పాటు పరిసర గ్రామాల్లోనూ మార్మోగింది. 

ఆయనే నా రాజకీయ గురువు
ఈ క్రమంలో ఆనాటి చౌబేపూర్‌ ఎమ్మెల్యే హరికిషన్‌ శ్రీవాస్తవ(జనతా దళ్‌)తో పరిచయం పెంచుకున్నాడు. ఆయనను తన రాజకీయ గురువుగా చెప్పుకొనేవాడు. ఆ తర్వాత శ్రీవాస్తవ బీజేపీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ నుంచి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనతో సంబంధాలు కొనసాగిస్తూనే దూబే అన్ని రకాలుగా తన బలాన్ని పెంచుకోసాగాడు. దీంతో రాజకీయ నాయకులకు కూడా దూబే అవసరం బాగా పెరిగింది. ఎన్నికల్లో గెలవాలంటే అతడి సాయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు ప్రతిగా చట్టం నుంచి వారు అతడిని కాపాడేవారు. అందుకే ఎప్పుడు అరెస్టైనా అనతికాలంలోనే బెయిల్‌పై తిరిగి వచ్చేవాడు. మళ్లీ యథేచ్చగా తన కార్యకలాపాలు సాగించేవాడు. అలా ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే రాష్ట్ర మంత్రిని చంపి నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అతడిపై దాదాపు 150 కేసులు నమోదైనట్లు భోగట్టా.(వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్: అనేక అనుమానాలు!)

తొలుత బీఎస్పీ.. ఆ తర్వాత 
అలా స్థానికంగా బలం పుంజుకున్న వికాస్‌ దూబే మాయావతి యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 90వ దశకంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ సభ్యుడిగా ఉండేవాడు. బిక్రూతో పాటు పరిసర గ్రామాల్లో పట్టు సాధించిన స్థానిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేవాడు. పంచాయతీలో అతడు చెప్పిందే వేదం. ఎన్నికల్లో అతడు నిలబెట్టిన వారిదే గెలుపు. 20 ఏళ్లుగా ఇదే పరంపర అక్కడ కొనసాగుతోంది. ఈ క్రమంలో 2001లో బీజేపీ మంత్రి సంతోష్‌ శుక్లాను హత్యచేసిన సమయంలో అతడు ఘిమావు జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఉన్నాడు. నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత ఘిమావు రిజర్వ్‌డ్‌గా మారడంతో తన మనుషులను అక్కడ నిలబెట్టాడు. పార్టీలతో సంబంధం లేకుండా 2015 వరకు వారిని గెలిపించుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలో తన భార్య రిచా దూబేను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమెను గెలిపించుకున్నాడు. ఆ తర్వాత దూబే సమాజ్‌వాదీ పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతుండగా.. ఇటీవల అతడి తల్లి సరళాదేవి కూడా తన కొడుకు ఎస్పీలో ఉన్నట్లు చెప్పడం గమనార్హం.

ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమై.. హతమై
ఈ నేపథ్యంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీఎస్పీ నుంచి టికెట్‌ ఆశిస్తున్నాడని.. కుదరని పక్షంలో బీజేపీ లేదా మరే ఇతర పార్టీ నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధపడ్డాడని స్థానికంగా చర్చ జరుగుతోంది. పార్టీ ఏదైనా సరే ఒక్కసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందితే తన నేర సామ్రాజ్యాన్ని కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో తనకు పట్టున్న కాన్పూర్‌ దేహత్‌ జిల్లాలోని రానియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

యోగి ఆదిత్యనాథ్‌ హయాంలో ఎన్‌కౌంటర్లు పెరిగిన నేపథ్యంలో అతడు రాజకీయంగా పలుకుబడి మరింతగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిన తరుణంలో.. ఏకంగా ఎనిమిది పోలీసులను అది కూడా డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారులపై కాల్పులకు తెగబడి వారిని హతమార్చడంతో దూబేకు అన్ని మార్గాలు మూసుకుపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే.. దూబే ఈరోజు ఎన్‌కౌంటర్‌లో హతం కాకపోయి ఉంటే భవిష్యత్తులో ఏదో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందేవాడేనేమో! దేశంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న ‘బడా నాయకుల్లో’ ఒకడిగా ఎదిగేవాడేమో!!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top