ఘజియాబాద్ నుంచి వీకే సింగ్ పోటీ | From Ghaziabad   VK Singh contest | Sakshi
Sakshi News home page

ఘజియాబాద్ నుంచి వీకే సింగ్ పోటీ

Mar 19 2014 2:29 AM | Updated on Mar 28 2019 8:40 PM

ఘజియాబాద్ నుంచి  వీకే సింగ్ పోటీ - Sakshi

ఘజియాబాద్ నుంచి వీకే సింగ్ పోటీ

లోక్‌సభ బరిలో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితాను ఆ పార్టీ మంగళవారం ఇక్కడ విడుదల చేసింది.

బీజేపీ కార్యకర్తల నుంచే నిరసన
 
 లోక్‌సభ బరిలో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితాను ఆ పార్టీ మంగళవారం ఇక్కడ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లోక్‌సభ సీటును కేటాయించారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్.. రానున్న ఎన్నికల్లో లక్నో నుంచి బరిలోకి దిగుతున్నారు. అదేవిధంగా షిల్లాంగ్ నుంచి షిబున్ లింగ్డో పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.

 సింగ్ ఎంపికపై కార్యకర్తల నిరసన


 లోక్‌సభ టికెట్ల కేటాయింపు విషయంలో బీజేపీకి ఆపార్టీ కార్యకర్తల నుంచే తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్‌కు ఘజియాబాద్ సీటును కేటాయించడంపై అక్కడి నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. స్థానికేతరుడైన సింగ్‌కు ఏప్రాతిపదికన సీటు కేటాయించారంటూ ఘజియాబాద్ బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి రాష్ట్ర పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ అధికార ప్రతినిధి అనంతకుమార్ కార్యకర్తలను శాంతింపజేసే యత్నం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ ఎన్నికల కమిటీ సిఫార్సుల మేరకే పార్టీ అధిష్టానం టికెట్లు కేటాయించిందని వివరించారు.

 కిరణ్ ఖేర్‌పై కోడిగుడ్లతో దాడి

 ఛండీగఢ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సీటు దక్కించుకున్న నటీమణి 58 ఏళ్ల కిరణ్ ఖేర్‌కు కూడా ఆ పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మంగళవారం ఛండీగఢ్‌కు వచ్చిన ఖేర్‌కు వ్యతిరేకంగా నల్ల జెండాలు ప్రదర్శించిన కార్యకర్తలు ఆమె వాహన శ్రేణిపై కోడిగుడ్లతో దాడి చేశారు. స్థానికులకే టికెట్ కేటాయించాలని నినదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement