‘గోప్యత’ ప్రాథమిక హక్కే! | Sakshi
Sakshi News home page

‘గోప్యత’ ప్రాథమిక హక్కే!

Published Thu, Jul 27 2017 12:55 AM

‘గోప్యత’ ప్రాథమిక హక్కే! - Sakshi

► కానీ పరిమితులు ఉండాలి
► సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం


న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రకారం గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చని, అయితే దానికి కొన్ని పరిమితులు ఉండాలని కేంద్రం బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపిం ది. దీన్ని పేద ప్రజలను కనీస అవసరాలకు దూరం చేసేందుకు వాడుకోకూడదని స్పష్టం చేసింది. ప్రైవసీకి సంబంధించిన చాలా అంశాలను ప్రాథమిక హక్కుల పరిధిలోకి తీసుకురాకూడదని పేర్కొంది. ‘స్వేచ్ఛతో ముడిపడిన గోప్యత.. గుణాత్మకమైన ప్రాథమిక హక్కు కావొచ్చు. అయితే అది నిరపేక్షం కాదు.

గోప్యతకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ప్రాథమిక హక్కుగా పరిగణించకూడదు’ అని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌.. చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జె.చలమేశ్వర్, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తదితర 9 మంది సభ్యుల ధర్మాసనానికి నివేదించారు. ప్రైవసీ.. ప్రాథమిక హక్కా, కాదా? ప్రభుత్వం దాన్ని ప్రాథమిక హక్కుగా భావిస్తే ఈ కేసును మూసేస్తామని ధర్మాసనం చెప్పడంతో అటార్నీ జనరల్‌ వివరణ ఇచ్చారు. భారత్‌ వంటి వర్ధమాన దేశాల్లో గోప్యత హక్కు ఏకరూప హక్కు కాదని.. కూడు, గూడు లేని 70 కోట్ల మంది ప్రజల ప్రాథమిక హక్కులను పిడికెడు మంది గోప్యత పేరుతో విఘాతం కలిగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్, పంజాబ్, పుదుచ్చేరి, పంజాబ్‌ల తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తూ..ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా కోర్టు.. ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రస్తావించింది. ‘అవి ఈ దేశ పేద ప్రజలపై చేసిన ఘోరమైన ప్రయోగం’ అని అభివర్ణించింది. ప్రభుత్వం ఒక మహిళను నీకెంతమంది పిల్లలు అని అడొగచ్చని, అయితే ఎన్నిసార్లు గర్భస్రావాలయ్యాయి అని అడగకూడదని పేర్కొంది.

Advertisement
Advertisement