జార్జి ఫెర్నాండెజ్‌ కన్నుమూత

Former Union Minister George Fernandes Dies - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఆయన స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఫెర్నాండెజ్‌ మంచానికే పరిమితమయ్యారు. 1930 జూన్‌ 3న మంగుళూరులో జన్మించిన జార్జి మ్యాథ్యూ ఫెర్నాండెజ్‌ 1967లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి కేబినెట్‌లో రక్షణ మంత్రిగా పనిచేసిన ఫెర్నాండెజ్‌ సమాచార శాఖ, రైల్వే, పరిశ్రమలు వంటి పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.

జనతాదళ్‌ నేతగా పేరొందిన ఫెర్నాండెజ్‌ వీపీ సింగ్‌ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా వ్యవహరించారు. మాతృసంస్ధ జనతాదళ్‌ను వీడిన అనంతరం ఆయన బీజేపీతో చేతులు కలిపారు. 1994లో సమతా పార్టీని స్ధాపించిన ఫెర్నాండెజ్‌ ఎన్డీఏలో భాగస్వామిగా బీజేపీతో కలిశారు. ఎన్డీఏలో కీలక నేతగా ఎదిగిన ఫెర్నాండెజ్‌ వాజ్‌పేయికి అత్యంత విధేయుడిగా పేరొందారు. ఫెర్నాండెజ్‌ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే కార్గిల్‌ యుద్ధం, పోఖ్రాన్‌ అణుపరీక్షలను భారత్‌ విజయవంతంగా చేపట్టింది. ఫెర్నాండెజ్‌ను పలు వివాదాలు చుట్టుముట్టిన సందర్భాల్లో వాజ్‌పేయి ఆయనకు వెన్నంటి నిలిచారు.

ఫెర్నాండెజ్‌ ప్రస్ధానం సాగిందిలా..

జార్జి ఫెర్నాండెజ్ రాజకీయ నాయకుడిగానే కాదు, జర్నలిస్టుగా, ట్రేడ్ యూనియన్ల నేతగా, వ్యవసాయదారుడిగా సుపరిచితులు.ఆయన ఆరేళ్ల వయసులోనే పాస్టర్ శిక్షణ కోసం బెంగళూరు వెళ్లారు.అక్కడి నుంచి 1949లో ముంబైకి మకాం మార్చి, సోషలిస్ట్ ట్రేడ్ యూనియన్లో చేరి కార్మికోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.

రైల్వేలో పనిచేస్తూ ట్రేడ్ యూనియన్ నేతగా కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం అనేక ధర్నాలు, ఆందోళనలు చేసిన ఫెర్నాండెజ్ 1967లో సౌత్ ముంబై నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్‌ను ఓడించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.1975లో ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిన ఫెర్నాండెజ్‌ 1976లో బరోడా డైనమైట్ కేసులో అరెస్టయ్యారు.1977లో బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి గెలిచి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.1989-90లో ప్రతిష్టాత్మక కొంకణ్ రైల్వే ప్రాజెక్టు కోసం రైల్వే మంత్రిగా విశేష కృషి చేశారు. బరాక్ మిస్సైల్ కుంభకోణం, తెహెల్కా వివాదాల్లో ఆయన పేరు వినిపించింది

.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top